అందుకు చంద్రబాబే కారణమా ...?
కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ రహస్యం విప్పి చెప్పేశారు. దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబే కారణమని తేల్చేశారు. చంద్రబాబు నిరంకుశ విధానాల కారణంగానే 2000 ల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. ముందుగా టిడిపి సర్కార్ లో వున్న తాను తక్షణం విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని అయితే ఆయన మాట వినలేదన్నారు. విద్యుత్ చార్జీల కారణంగా తెలంగాణ రైతాంగం దారుణంగా దెబ్బతింటుందని ఆందోళనతో మేధావులతో సమాలోచనలు జరిపానన్నారు.
సమైక్య రాష్ట్రంతో నష్టపోయాం ...
సమైక్య రాష్ట్రంలో వలసపాలకుల పాలనలో తెలంగాణ నష్ట పోతుందనే తెలంగాణ ఉద్యమాన్ని కేవలం నలుగురితో ప్రారంభించానని వెల్లడించారు కెసిఆర్. ఎంత పోరాటం చేసినా కనికరం లేని ప్రభుత్వం కాల్పులకు సైతం తెగబడింది తప్ప చార్జీలు తగ్గించలేదన్నారు. అయినా అలుపెరగని పోరాటంతో తెలంగాణ సాధనకు 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిర్మించామని కెసిఆర్ చెప్పుకొచ్చారు. ప్రగతి నివేదన సభలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ అంశం తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగిన వైనాన్ని తనదైన శైలిలో వెల్లడించి అందరిని ఆకట్టుకున్నారు కెసిఆర్. చంద్రబాబు క్యాబినెట్ లో బెర్త్ దక్కక పోవడంతోనే కెసిఆర్ టీఆర్ఎస్ స్థాపనకు కారణమైందన్నది వాస్తవానికి పొలిటికల్ సర్కిల్ లో చెప్పుకునే మాట. ఆవిధంగా చూసినా చంద్రబాబు టీఆర్ఎస్ ఏర్పాటుకు కారణం అయినట్లే చెప్పుకోవాలి. ఏవిధంగా చూసినా కెసిఆర్ బాబు కు మాత్రం రుణ పడే వుండాలన్నమాట.