చంద్రబాబును వేటాడుతున్న వర్మ ..?
సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా వెరైటీ అని అందరికి తెలిసిందే. సినిమాలు ప్లాప్ లు అయ్యాక నిత్యం వార్తల్లో వుంటూ తన పాపులారిటీ ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేసుకురావడంలో రాముకు సాటి ఎవరు రారు. బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లకు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ గతంలో సినిమా ప్రకటించి మిన్నకున్నారు. ఆ తరువాత బాలయ్య చిత్రం జనవరిలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మళ్ళీ సీన్ లోకి వచ్చారు వర్మ. గతంలో ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయడం గ్యారంటీ అని తేల్చేశారు ఆయన. దీనికోసం రంగం సిద్ధం చేస్తున్న వర్మకు ఒక వ్యక్తి నెట్ లో తారసపడ్డారు. అంతే ఆయన తాజాగా తన ట్విట్టర్ లో ఛాలెంజ్ ఇప్పుడు విసిరారు. అదే ఇప్పుడు నెటిజెన్లకు కంటినిండా పని చెప్పింది.
ఈ వ్యక్తిని చూపిస్తే లక్ష రూపాయలు బహుమతి ...
అచ్చం చంద్రబాబు ను పోలిన వ్యక్తి ఒక హోటల్ లో సర్వర్ గా సేవలు అందిస్తున్న వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ వ్యక్తి ఆచూకీ ఇచ్చిన వారికి లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. అదే ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. బాబు పై విమర్శలకు సదా సిద్ధం గా వుండే జగన్ మీడియా ఈ ఛాలెంజ్ ను విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ వ్యక్తి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దొరకొచ్చని కూడా జగన్ మీడియా క్లూలు కూడా ఇస్తుంది. ఆ వీడియో లో చంద్రబాబు లా వున్న వ్యక్తి నిక్కరుతో చట్నీలను ఖాతాదారులకు సర్వ్ చేస్తూ కనిపిస్తారు. ఈ వీడియో చూసిన వారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
ఆయనే దొరికితే ....
వర్మ పోస్ట్ చేసిన వీడియో లోని వ్యక్తి దొరికితే రాము తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి మరింత క్రేజ్ పెరగనుంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం తరువాత నుంచి వున్న భాగాన్ని వర్మ తెరకెక్కించనున్నారు. దాంతో ఇందులో చంద్రబాబు పాత్ర ధారికి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి స్థాయిలో గుర్తింపు వుండే పాత్ర. ఎన్టీఆర్ కు జరిగిన పరాభవాలు, ఎన్టీఆర్ పదవీచ్యుతి వంటి సీన్స్ అన్ని మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. ఇప్పటికే బాలయ్య తీయబోయే చిత్రంలో చంద్రబాబు పాత్రను దగ్గుబాటి రాణా సమర్ధవంతంగా ఒదిగిపోయారు. రాణా యువ చంద్రబాబు గెటప్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో వర్మ అచ్చం చంద్రబాబు లా వుండే వ్యక్తిని వెతికే వేట గట్టిగానే ప్రారంభించారు. ఆయన ప్రయత్నం ఫలిస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ప్రజల్లో పెద్ద చర్చకే తెరలేపడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.