Tue Nov 26 2024 10:44:13 GMT+0000 (Coordinated Universal Time)
చినబాబుకు చింత అదేనట
నారా లోకేష్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2014 ముందు వరకూ పార్టీని వెనకుండి నడిపించారు.
నారా లోకేష్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2014 ముందు వరకూ పార్టీని వెనకుండి నడిపించారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వంతో పాటు అనుబంధ సంఘాలను ఆయన పర్యవేక్షించే వారు. 2014 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రిగా లోకేష్ కొంత పరవాలేదనిపించుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన టీడీపీలో కూడా క్రియాశీలకంగా ఉన్నారు. కానీ లోకేష్ భవిష్యత్ ఏమిటన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఓటమి తర్వాత....
2019 ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓటమి పాలయింది. కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. చివరకు నారా లోకేష్ కూడా విజయం సాధించలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ నాయకత్వంపై నమ్మకం పోయింది. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవద్దంటూ గతంలోనే కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుకు చెప్పారు. ఈసారికి చంద్రబాబు సారథ్యంలోనే ఎన్నికలకు వెళితే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించి లోకేష్ కు ఈ మూడేళ్ల కాలంలో పెద్దగా బాధ్యతలను కూడా అప్పగించలేదు.
ఈసారి అధికారంలోకి వస్తే...
చంద్రబాబుకు వయసు మీద పడుతుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే ఒక రెండేళ్ల పాటు పాలనను గాడిలో పెట్టి చంద్రబాబు పక్కకు తప్పుకుని ముఖ్యమంత్రిగా లోకేష్ ను చేస్తారన్న ప్రచారం ఎటూ ఉండనే ఉంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలిస్తే రెండేళ్ల తర్వాత అయినా సీఎంగా లోకేష్ ప్రమాణస్వీకారం చేస్తారని భావించారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. ఈక్వేషన్లు లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమితోనే తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగనుంది. ప్రధానంగా జనసేన, బీజేపీలను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తుంది.
ఈసారి వచ్చినా కష్టమే....
కూటమితో పోటీ చేసి తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించినా ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు చంద్రబాబు మాత్రమే కొనసాగుతారు. కుటుంబ వత్తిడులకు లొంగి లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్నా మిత్రపక్షాలు అంగీకరించవు. దీంతో లోకేష్ కు మరో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కోసం వెయిట్ చేయాల్సిందేనన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా డౌటేనంటున్నారు. మొత్తం మీద లోకేష్ జాతకం మాత్రం రాజకీయంగా పెద్దగా మారేటట్లు కన్పించడం లేదు.
- Tags
- nara lokesh
- tdp
Next Story