లోకేష్ ఆ క్రెడిట్ కోసమేనా?
నారా లోకేష్ తనను తాను నాయకుడిగా చెప్పుకోవడానికి ఛాన్స్ లభించింది. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రకు లోకేష్ సిద్ధమయ్యారు
అవును.. వచ్చే ఎన్నికల్లో గెలిచినా అది తన వల్లనే అని చెప్పుకోవడానికి లోకేష్ కు ఒక మంచి అవకాశం దొరికింది. లోకేష్ తనను తాను నాయకుడిగా చెప్పుకోవడానికి ఛాన్స్ లభించింది. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రకు లోకేష్ సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమై దాదాపు పదిహేను నెలలు సాగనుంది. నాలుగు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. నాలుగు వందల రోజుల పాటు ప్రజలతో మమేకం కానున్నారు. పాదయాత్రతో లోకేష్ లో సమూలమైన మార్పు వచ్చే అవకాశముంది.
మార్పు మాత్రం...
అదే సమయంలో ఆయన మాటతీరు, నడవడిక, నేతలతో బిహేవియర్ లో కూడా ఈ యాత్రతో మార్పు వచ్చే అవకాశముంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేసినప్పుడు కూడా ఇదే మార్పును గమనించాం. చంద్రబాబు కూడా కోరుకుంటున్నదదే. కష్టమైనా లోకేష్ పాదయాత్రతో రాజకీయంగా రాటుదేలతారని భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతారు. 2014 ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వబట్టే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికీ సూటి పోటి మాటలు అంటుంటారు. తాను లేకపోతే ఆనాడే తెలిసి వచ్చేదని కూడా పవన్ చేసిన కామెంట్స్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు ఎక్కడో తగులుతాయి. కానీ ఏమీ అనలేరు.