Tue Dec 24 2024 13:20:54 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడు తరహా పక్కా ప్లాన్
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ భవిష్యత్ నేత. దానిని ఎవరూ కాదనలేరు
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ భవిష్యత్ నేత. దానిని ఎవరూ కాదనలేరు. కానీ ఇప్పుడే నాయకత్వ బాధ్యతలను అప్పగించే సాహసాన్ని చంద్రబాబు చేయరు. తన తర్వాత లోకేష్ పార్టీని నడపాలి. అందుకు లోకేష్ ఇంకా కొంత నలగాలని సీనియర్ నేతలు సయితం భావిస్తున్నారు. ఎవరెన్ని చెబుతున్నా క్యాడర్ మాత్రం లోకేష్ తమ నాయకుడిగా అంగీకరిస్తుంది. ఇటీవల పల్నాడులో లోకేష్ పర్యటన చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. లోకేష్ పర్యటనకు పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారు. తాము వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చారు.
పాదయాత్రలో...
కొంతకాలం క్రితం జరిగిన పల్నాడు టూర్ లోకేష్ లో మరింత కాన్ఫిడెన్స్ పెంచిందనే చెప్పాలి. లోకేష్ రాష్ట్రమంతటా తిరిగేందుకు రెడీ అవుతున్నారు. పాదయాత్ర చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పాదయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే జగన్ కంటే ఎక్కువ కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని లోకేష్ డిసైడ్ చేశారు. చినబాబు పాదయాత్ర నాలుగువేల కిలోమీటర్లకు పైగానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు రూట్ మ్యాప్ ను తయారు చేస్తున్నారు.
ఏడాదికి పైగానే....
లోకేష్ పాదయాత్ర దాదాపు ఏడాదికి పైగానే సాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వరకూ యాత్ర సాగేలా ఉండేలా చూస్తున్నారు. 175 నియోజకవర్గాలను టచ్ చేసేలా లోకేష్ పాదయాత్ర కొనసాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల వేడి చల్లారకుండా ఉండేలా పాదయాత్ర ఉండనుంది. ప్రధానంగా యువతను ఆకట్టుకునేలా లోకేష్ పాదయాత్ర కొనసాగాలని భావిస్తున్నారు. యువతలో మార్పు తేగలిగితే విజయం ఖచ్చితంగా తమదేనన్న ధీమాలో ఉన్నారు.
నారావారిపల్లె నుంచి...
మరోవైపు పాదయాత్ర తన సొంత ఊరయిన నారావారాపల్లి నుంచి ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నారు. లేదా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ రెండింటిలో ఒకటి ఖాయమవుతందని తెలుస్తోంది. పల్నాడులో ఇటీవల పోటెత్తిన మాదిరిగా లోకేష్ పాదయాత్ర మొత్తం ఉండేలా టీడీపీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. లోకేష్ పాదయాత్రతో పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు.
Next Story