బాబు రెడీ అయిపోతున్నారు...!
ఎన్నికలు సమీపిస్తుండటం...మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతలకు సీరియస్ గా క్లాస్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జులు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
కొందరి వైఖరిపట్ల.....
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీని పటిష్ట పర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. ఇప్పటికే గ్రామదర్శిని పేరిట ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా కొందరు సీరియస్ గా తీసుకోవడం లేదు. తాను రోజుకో జిల్లాలో పర్యటిస్తూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పట్టీపట్టన్నట్లు వ్యవహరించడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
ప్రజా సమస్యలను పరిష్కరించుకుని.....
అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే శ్రమించాలని, అందుకు ఏమేం చేయాలో చంద్రబాబు నేటి సమావేశంలో ఎమ్మెల్యేలకు, ఇన్ ఛార్జులకు వివరించనున్నారు. గ్రామదర్శిని కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది. కొన్ని ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను నేరుగా సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చి ఈ ఆరునెలల్లోగా దానిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకునే దిశగా కృషి చేయాల్సి ఉంటుంది.
సర్వే ప్రకారం....
చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేల ప్రకారం ఆయన వారిని నేరుగా సమావేశంలోనే నిలదీసే అవకాశముందని తెలియడంతో ఎమ్మెల్యేలు టెన్షన్ పడిపోతున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వరుసగా జిల్లాల వారీగా సమీక్షలను కూడా చంద్రబాబు చేయనున్నారు. ఈసమీక్షల్లో వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించడంతో పాటు టిక్కెట్ దక్కని వారికి భవిష్యత్తులో తాను ఏం చేయనున్నదీ చంద్రబాబు వివరిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు ఎన్నికలకు తన సైన్యాన్ని రెడీ చేసుకుంటున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- assembly sessions
- gramadarshini
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అసెంబ్లీ సమావేశాలు
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- గ్రామదర్శిని
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ