Mon Dec 23 2024 09:33:56 GMT+0000 (Coordinated Universal Time)
గోక్కోవడమంటే ఇదే.. పుండవుతుందా?
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు అందచేసింది.
రఘురామ కృష్ణరాజు అధికారికంగా వైసీపీ పార్లమెంటు సభ్యుడు. అయితే అనధికారికంగా ఆయన టీడీపీ, బీజేపీ అనే చెప్పాలి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామ కృష్ణరాజు ఏపీ రాజకీయాలకే పరిమితమవుతారని అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీలయితే బీజేేపీ లేకుంటే టీడీపీ నుంచి అయినా ఆయన పోటీ చేయక తప్పదంటున్నారు. అందుకు ముందు నుంచే ఆయన మానసికంగా, అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నారనే చెప్పాలి.
డామినేట్ చేయబోయి...
తెలుగుదేశం పార్టీలో చేరి చివరి నిమిషంలో వైసీీపీలో చేరి టిక్కెట్ పొంది నరసాపురం నుంచి పార్లమెంటు సభ్యుడిగా రఘురామ కృష్ణరాజు ఎన్నికయ్యారు. తొలి ఏడాది జగన్ తో ఆయన సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ రాజు గారి దర్పం, కమాండ్ జగన్ ముందు పనిచేయలేదంటారు. జగన్ ను ఏకవచనంతో సంభోదించడం ఆయనకు నచ్చడం లేదని చెబుతారు. జగన్ అప్పటి నుంచి రఘురామ కృష్ణరాజును దూరం పెట్టారన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్. తనకంటే వయసులో చిన్నవాడిగా, తాను జగన్ కేసులో ఇరుక్కున్నప్పుడు చేసిన సాయాన్ని దృష్టిలో ఉంచుకుని రఘురామ కృష్ణరాజు డామినేట్ చేయబోయి ఇలా శత్రువుగా మారారనే వారు కూడా పార్టీలో లేకపోలేదు.
ఇక్కడ వేలు పెట్టి...
అయితే అది ఏపీ కథ. ఏపీ వరకూ రఘురామ కృష్ణరాజు రాజకీయాలకు పరిమితమయితే ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ తెలంగాణలో వేలు పెట్టడమే. అక్కడ కేసీఆర్ ను ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గోక్కున్నట్లయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామ కృష్ణరాజుకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన తాను పార్లమెంటు సభ్యుడినని తను నోటీసులు వేరే రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని తన న్యాయవాదులతో చెప్పించినట్లు తెలిసింది. సిట్ ముందుకు రఘురామ కృష్ణరాజు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది పక్కన పెడితే తెలంగాణ పాలిటిక్స్ లో రాజు అనవసరంగా ఇరుక్కున్నారని అనిపిస్తుంది.
ఢిల్లీకే పరిమితమవుతారా?
బీజేపీ పెద్దలకు దగ్గరకు కావడానికి, జగన్ ను ఎదుర్కొనడానికి ఆయన తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొనుగోళ్లకు తాను వంద కోట్లు ఇవ్వడానికి అయినా రెడీ అంటూ ఆయన అన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆడియో టేపుల్లోనూ, సిట్ విచారణలోనూ ఈ విషయం వెల్లడి కావడంతో ఆయన 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. రఘురామ కృష్ణరాజు లేనిపోని విషయాల్లో తలదూర్చి ఇలా తలనొప్పులు తెచ్చుకుంటున్నారని ఆయనకు దగ్గరగా ఉండేవారే కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీతో తగవు పెట్టుకుని ఏపీకి దూరమయ్యారని, ఇప్పుడు కేసీఆర్ ఆగ్రహానికి లోనయి తెలంగాణలోనూ కాలుమోపలేని పరిస్థితి తెచ్చుకున్నారంటున్నారు. ఇక ఢిల్లీకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు తెలంగాణలోనూ చిక్కుల్లో ఇరుక్కున్నారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story