Sun Dec 22 2024 22:07:52 GMT+0000 (Coordinated Universal Time)
ఇక అడుగులు అటు పడవట
నారాయణ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనపడుతుంది. ఆయనకు ఇక రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కూడా లేదని చెబుతున్నారు
మాజీ మంత్రి నారాయణ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనపడుతుంది. ఆయనకు ఇక రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కూడా లేదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాజకీయాల్లోకి వెళ్లి అనవసరంగా తప్పు చేశానని నారాయణ భావిస్తున్నారు. తాను నెల్లూరు ప్రజల కోసం మంత్రిగా ఎంత కష్టపడినా తనను ఓడించడాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే గత మూడేళ్లుగా ఆయన ప్రజలకు, పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఎన్నికలకు రెండేళ్లు....
ిఇక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. టీడీపీ, జనసేన కలుస్తాయంటున్నారు. రాజధానిపై కూడా హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. మూడు నెలల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇవ్వాలని చెప్పింది. ఈ నేపథ్యంలో నారాయణకు రాజకీయంగా కూడా వచ్చే ఇబ్బందులేమీ లేవు. ఆయన తిరిగి టీడీపీలో యాక్టివ్ కావచ్చు. ఇటీవల నెల్లూరు జిల్లా సీనియర్ టీడీపీ నేత ఒకరు నారాయణను కలసి పార్టీలో యాక్టివ్ కావాలని సూచించగా తాను ఇక అటువైపు రాలేనని చెప్పారని తెలిసింది.
కాపు సమావేశాలకు....
మున్సిపల్ శాఖ మంత్రిగా, సీఆర్డీఏ ఉపాధ్యక్షుడిగా నారాయణ గత టీడీపీ హయాంలో ఒక ఊపు ఊపారు. మున్సిపల్ శాఖ మంత్రిగా అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేశారు. చంద్రబాబుకు కుడి భుజంగా ఉండేవారు. కాపు సామాజికవర్గం కావడంతో నారాయణకు చంద్రబాబు వద్ద మంచి ప్రయారిటీయే లభించింది. ఇప్పుడు కాపు సామాజికవర్గం నేతలు తరచూ సమావేశమవుతున్నారు. ఆ సమావేశాలకు తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు నాయకత్వం వహిస్తున్నారు. అయినా నారాయణ మాత్రం దానికి కూడా దూరంగా ఉన్నారు.
వ్యాపారంపైనే....
నారాయణ పూర్తిగా వ్యాపారాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలను రెండు రాష్ట్రాల్లో మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కేవలం తనకు నచ్చిన పార్టీకి నిధులు ఇవ్వడం మినహా నారాయణ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించకోక పోగా ఉన్న వ్యాపారం కూడా దెబ్బతినిందని, అందుకే ఆయన ఇక రాజకీయం వైపు అడుగులు వేయకూడదని నిర్ణయించుకున్నారంటున్నారు.
Next Story