ఆ..దెందూ దొందే.... మాకు ఛాన్సివ్వండి
కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, రెండింటిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని... రెండు పార్టీలూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇవి రెండూ పార్టీలూ నాణేనికి రెండు వైపుల లాగా ఉన్నాయని, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. మంగళవారం నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ... టీఆర్ఎస్, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో శిక్షణ పొందిన విద్యార్థి కేసీఆర్ అని, తెలంగాణ ప్రజలకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ నే అన్నారు. మార్పు కోసం తెలంగాణలో బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- ఈ నాలుగున్నరేళ్లు ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేసిందో పైసాపైసా అడగాల్సిన సమయం ఇది. ప్రజల కోసం క్షణక్షణం ఏం చేశారో అడగాల్సిన సమయం ఇది.
- నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, రైతుల కోసం ఏం చేశారో అడగాల్సిన సమయం ఇది. ఓటుతో ఆ పార్టీకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.
- తెలంగాణలో టీఆర్ఎస్, ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదనుకుంటోంది. గత యాభై ఏళ్లుగా అభివృద్ధి చేయకున్నా కాంగ్రెస్ ఎలా గెలిచిందో తానూ అలానే గెలవాలనుకుంటున్నారు. కానీ, పరిస్థితులు మారిపోయాయి. 50 ఏళ్లు కాదు... 50 నెలలు అభివృద్ధి చేయకున్నా యువత ఊరుకోదు.
- నిజామాబాద్ ను ముఖ్యమంత్రి లండన్ గా మారుస్తానని చెప్పారు. స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. కానీ, కనీసంగా మంచినీరు, కరెంటు, రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఇక్కడ ఉంది. దేశంలోని బలహీన రాష్ట్రాల్లో ఏ పరిస్థితి ఉందో నిజామాబాద్ లోనూ అదే పరిస్థితి ఉంది. లండన్ ఏవిధంగా ఉంటుందో ఒక ఐదేళ్లు ముఖ్యమంత్రి వెళ్లి చూసిరావాలి.
- నిజామాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పని చేస్తున్నారా లేదా నగరానికి నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావడం లేదు.
- వాగ్దానాల అమలులో, పథకాల అమలులో పూర్తిగా నిర్వర్తించని ముఖ్యమంత్రి ఆఖరికి ఐదేళ్ల పదవీకాలాన్ని కూడా పూర్తి చేయకుండా ముందస్తుకు వెళ్లారు. ప్రజలకు ఈ ప్రభుత్వం నుంచి ముందస్తుగా విముక్తి కలుగుతున్నందున చాలా సంతోషం.
- ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగను అని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చెప్పారు. కానీ, నీళ్లు ఇవ్వకుండానే ఇప్పుడు ఓట్లడగడానికి వచ్చారు. కనీసంగా తాగు నీరు ఇవ్వని ముఖ్యమంత్రి పాలనకు చెరమగీతం పాడాలి.
- నిజామాబాద్ వైద్య కళాశాల దయనీయ స్థితిలో ఉంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య కళాశాల కంటే గ్రామాల్లో ఉండే సాధారణ హాస్టల్ బాగుంటుంది. దీనిని బట్టే ముఖ్యమంత్రి పాలన ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
- ముఖ్యమంత్రి తీవ్ర అభద్రతా భావంతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడూ చూసినా మంత్రాలుతంత్రాలు, నిమ్మకాయలు, మిరపకాయలతో పూజలు చేస్తున్నారు. 50 కోట్ల ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తే తనను ఎవరూ పట్టించుకోరనే అభద్రతాభావంతో కేసీఆర్ తెలంగాణలో ఈ పథకం అమలు చేయడం లేదు. దీంతో తెలంగాణ ప్రజలకు నష్టం కలిగింది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ప్రారంభించిన రెండు నెలల్లో దేశంలో మూడు లక్షల ప్రజలకు చికిత్స జరిగి వారి కుటుంబాలు ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డాయి.
- కొన్ని పార్టీలకు అభివృద్ధితో సంబంధం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే దశాబ్ధాలుగా రాజకీయం చేస్తున్నారు. కానీ అభివృద్ధి అందరికీ చేరాలి అనేదే బీజేపీ నినాదం.
- అందరికీ విద్య, యువతకు ఉపాధి కల్పన, ఆదాయాన్ని పెంచడం, వృద్ధులకు భద్రత, రైతుకు మేలు, అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అనేదే మా నినాదం.
- కేసీఆర్ గతంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
- యూపీఏ ప్రభుత్వం ఉప్పుతిన్న కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ కి వ్యతిరేకం అంటే నమ్మకండి. ఇద్దరూ కలిసి దొంగాట ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. నిజంగా ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ కేవలం బీజేపీ ఒక్కటే.
- ఇటీవల జరిగిన బహిరంగ సభకు రాహుల్, సోనియా గాంధీ వచ్చారు. తల్లీకొడుకు కలిసి టీఆర్ఎస్ ది కుటుంబ పార్టీ అనడం హాస్యాస్పదం. కేసీఆర్ కుటుంబంతో పాటు, కాంగ్రెస్ ది కూడా కుటుంబ పాలన కాదా ?
- దేశంలో సామాన్య ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరిపించి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బ్యాంకుల్లోనే జమా చేసే పారదర్శక విధానం తీసుకువచ్చి అవినీతిని నిర్మూలించాం.
- 2008 - 2014 మధ్య పెద్దఎత్తున బ్యాంకుల లూఠీ జరిగింది. సామాన్యుల డబ్బంటా 12 మంది లూఠీ చేసేందుకు అప్పటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మా ప్రభుత్వం వచ్చాక చట్టాలను కఠినం చేశాం. బయటకి పారిపోయిన వారిని వదిలిపెట్టం. వారి నుంచి డబ్బు వసూలు చేస్తాం.
- తెలంగాణ కోసం పోరాడిన యువకులను తుపాకీలతో మట్టుబెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా క్షమిస్తారు ? ఎలా మళ్లీ రాష్ట్రానికి రాణిస్తారు ?
- దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ఓడినా మళ్లీ ప్రజలు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వడం లేదు. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్కసారి ఓడిపోయాక మళ్లీ ప్రజలు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణను ఇన్ని కష్టాలు పెట్టిన కాంగ్రెస్ కి మళ్లీ అవకాశం ఇవ్వొద్దు. బీజేపీకి అధికారం ఇస్తే కేంద్రంలోనూ బీజేపీనే ఉన్నందున అభివృద్ధి రెండింతలు అవుతుంది.