Mon Dec 23 2024 03:45:21 GMT+0000 (Coordinated Universal Time)
సైకిల్ కు షాకిస్తున్న సర్వేలు.. మళ్లీ జగన్ జెండాయే
జాతీయ మీడియా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. టీడీపీకి ప్రతికూలంగా సర్వేలు రావడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది
జాతీయ మీడియా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీయే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. లోక్సభ సీట్ల వారీగా జాతీయ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. 2024 లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్ల ముందే జాతీయ మీడియా సంస్థలు సర్వేలు ప్రారంభించాయి. పీపుల్స్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏ సర్వే చూసినా అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వేల్లో స్పష్టమవుతుంది.
కేంద్రంలోనూ, తెలంగాణలోనూ...
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో తేలింది. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ల పట్ల క్రేజ్ తగ్గలేదని సర్వేల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో మోదీ రెండుసార్లు, తెలంగాణలో కేసీఆర్ రెండుసార్లు ఇప్పటికే విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం ఇద్దరూ ఉవ్విళ్లూరుతున్నారు. ఇద్దరికీ జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో అనుకూల ఓట్లు పడ్డాయి. తిరిగి కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ రావడం ఖాయమని తేల్చాయి. టైమ్స్ నౌ సర్వేలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఆరు నుంచి పది పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పింది.
టైమ్స్ నౌ సర్వేలోనూ...
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తాజాగా టైమ్స్ నౌ మరోసారి సర్వే చేసింది. ఆగస్టు 15వ తేదీ వరకూ సర్వే నిర్వహించామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో జగన్ పార్టీకి 17 నుంచి 23 పార్లమెంటు స్థానాలు వస్తాయని తేల్చి చెప్పింది. అంటే పార్లమెంటు సీట్ల ప్రకారం చూస్తే అసెంబ్లీ సీట్లు కూడా గతంలో మాదిరిగానే వైసీపీకి వస్తాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 25 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలను వైసీపీయే కైవసం చేసుకుంటుందని చెప్పడం విశేషం. మూడేళ్లలో జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందనుకుంటున్న తరుణంలో సర్వేలు అనుకూలంగా రావడంతో విపక్ష పార్టీలు కొంత డైలమాలో పడ్డాయి.
వరస సర్వే రిపోర్టులతో...
గత నెలలో ఇండియా టీవీ సర్వే చేసింది. అందులో 19 పార్లమెంటు స్థానాలు వైసీపీకి, ఆరు స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పింది. ఈ నెలలో జరిగిన ఇండియా టుడే సర్వేలో 18 సీట్లు వైసీపీకి వస్తాయని, టీడీపీకి ఏడు స్థానాలు వస్తాయని తేల్చింది. తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వేలో 17 నుంచి 23 సీట్ల వరకూ వస్తాయని చెప్పడంతో జగన్ పై ప్రజల్లో సానుకూలత బలంగా ఉందని తేలింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారని, పేద, దిగువ మధ్య తరగతి వర్గాల ప్రజలు జగన్ కు జై కొడుతున్నారని జాతీయ మీడియా సంస్థలు జరుపుతున్న సర్వేల్లో స్పష్టమవుతుంది. రానున్న రెండేళ్ల కాలంలో మరింత బలపడతామని అధికార వైసీపీ చెబుతుండగా, సర్వేలను నమ్మడానికి వీల్లేదని, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
Next Story