కోడి కత్తి డ్రామాను తేల్చేస్తాం
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి కోడికత్తి డ్రామా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. మంగళవారం కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ... తాను రాజకీయ పోరాటం చేస్తా కానీ, కక్షలకు పాల్పడనని... 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా తాను నేరాలు చేశానా అని ప్రశ్నించారు. 24 ల్యాండ్ మైన్లతో తనపై దాడి జరిగినా తాను ప్రతిపక్షం నింద వేయలేదన్నారు. జగన్ పై ఘటన కేంద్ర బలగాల పరిధిలో ఉన్న ఎయిర్ పోర్టులో జరిగిందని, ఘటనకు పాల్పడ్డ వ్యక్తి జగన్ కు వీరాభిమాని అని పేర్కొన్నారు. తాను 40 ఏళ్లగా హింస మీద పోరాడానని, శాంతిభద్రతల కోసం పోరాడానని, ప్రాణం పోయినా పర్వాలేదు అని ప్రజల భద్రత కోసం పోరాడానని గుర్తు చేశారు.
ఆపరేషన్ గరుడ నిజమే
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కేంద్రం ఆపరేషన్ గరుడ చేస్తుందని శివాజీ చెప్పారని... ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నిజమే అనిపిస్తోందన్నారు. కేంద్రం చిల్లర రాజకీయాలు చేస్తే తెలుగు జాతి పౌరుషం చూపిస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఐటీ దాడులు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రం కోసం కేంద్రంతో పోరాడుతునన ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఆరోజు ఇందిరా గాంధీకి తాను బయపడలేదని, ఇప్పుడు నరేంద్ర మోదీకి భయపడనని, 40 ఏళ్లుగా నిష్ఠతో పనిచేశానన్నారు. దేశం కోసం టీడీపీ చేసే పోరాటానికి ప్రజలు 25 ఎంపీ స్థానాలు గెలిపించి మద్దతు తెలపాలని కోరారు.