Mon Dec 23 2024 10:01:34 GMT+0000 (Coordinated Universal Time)
నూతన పార్లమెంట్ భారత సూర్యోదయానికి సాక్ష్యం : ప్రధాని
మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఈ పార్లమెంట్ మాధ్యమంగా మారుతుందని ప్రధాని అన్నారు. ఈ కొత్త భవనం స్వావలంబన..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. ఆచార వ్యవహారాలతో పూజలు చేసిన తర్వాత.. ప్రధాని తొలుత లోక్సభ ఛాంబర్లో సెంగోల్ను ఏర్పాటు చేసి.. తమిళనాడుకు చెందిన 20 మంది పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. దీని తర్వాత ప్రధానితో పాటు పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..
దేశ అభివృద్ధి ప్రయాణంలో మధుర క్షణాలు ఉన్నాయని.. అవి ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. కొన్ని తేదీలు, కాలం ముఖంపై చెరగని ముద్ర వేస్తాయి. ఈరోజు.. 28 మే 2023 కూడా అలాంటి శుభ సందర్భమేనని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పార్లమెంట్ దేశ ప్రజల కలలకు అద్దం పడుతుందని.. వారి కలలను ఇక్కడి నుంచే సాకారం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళాలంటే.. పేదల సంక్షేమం కోసం మనమందరం నాయకులుగా కష్టపడాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మనం ముందుకు రావాలని ప్రధాని అన్నారు.
మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఈ పార్లమెంట్ మాధ్యమంగా మారుతుందని ప్రధాని అన్నారు. ఈ కొత్త భవనం స్వావలంబన భారత్ సూర్యోదయానికి సాక్ష్యమిస్తుందని, కొత్త కలలు సాకారం అవుతాయని మోదీ అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి కూడా అని ప్రధాని అన్నారు. నేడు ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారతదేశం కూడా పెద్ద పునాది. ప్రజాస్వామ్యం అనేది మనకు ఒక వ్యవస్థ మాత్రమే కాదు.. అది ఒక సంస్కృతి, ఆలోచన, సంప్రదాయం అని మోదీ అన్నారు.
విజయానికి మొదటి షరతు విజయం సాధించాలనే నమ్మకమేనని ప్రధాని అన్నారు. ఈ కొత్త పార్లమెంట్ హౌస్ ఆ నమ్మకానికి కొత్త రూపునిస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో కొత్త పార్లమెంట్ మనందరికీ కొత్త ప్రేరణగా మారుతుందని ప్రధాని అన్నారు. ఈ పార్లమెంట్ హౌస్ ప్రతి భారతీయుడి కర్తవ్య భావాన్ని మేల్కొల్పుతుందన్నారు.
పాత భవనంలో పనిచేయడం చాలా కష్టంగా ఉందని.. ఈ విషయం అందరికీ తెలుసునని మోదీ అన్నారు. సీటింగ్ కొరతతో పాటు సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. అందుకే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంపై రెండు దశాబ్దాలకు పైగా చర్చ నడుస్తోందన్నారు. ఈ కొత్త భవనాన్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించినందుకు నేను సంతోషిస్తున్నాను. కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ఈనాటి అవసరంగా ప్రధాని అభివర్ణించారు. అంతిమంగా.. ఈ పార్లమెంట్ నుండి దేశాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని.. కొత్త చరిత్రను లిఖిస్తామని ప్రధాని చెప్పారు.
Next Story