ముందుంది ముసళ్ల పండుగ!
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే, కాంగ్రెస్ మరిన్ని అప్పులు చేయాలి. ఆదాయం చారాణా, వ్యయం బారాణా... ఇదీ ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. కొత్త రాష్ట్రం నెత్తిన రుణ భారాన్ని మోపబోయే హామీలేంటో చూద్దాం.
అలవిమాలిన హామీలను అమలు చేసేదెలా?
48 గంటల ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ మూడో అసెంబ్లీ ముఖ్యమంత్రిగా, రెండో సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓటుకు నోటు కేసులో సీసీ కెమెరాల సాక్షిగా దొరికిపోయి, అవమానాలు ఎదుర్కొన్న నాయకుడు నేడు రాష్ట్రంలోని అత్యున్నత పదవిని అలంకరించడం... కాల వైచిత్రి.
ఇళ్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు, గెలుపు సంబరాలతోనే రోజులు గడవవు. మిగులు ఆదాయ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, తొమ్మిదేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పును మూటగట్టుకుంది. వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలు మరో లక్ష కోట్లు ఉంటాయని అంచనా. కామధేనువు లాంటి హైదరాబాద్ ఉన్నా, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఏ పూటకాపూట కొనుక్కోవాల్సిన కరెంటు.. అన్నీ కలిపి అక్షయ పాత్ర లాంటి తెలంగాణను అప్పుల పాలు చేశాయి.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే, కాంగ్రెస్ మరిన్ని అప్పులు చేయాలి. ఆదాయం చారాణా, వ్యయం బారాణా... ఇదీ ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. కొత్త రాష్ట్రం నెత్తిన రుణ భారాన్ని మోపబోయే హామీలేంటో చూద్దాం.
పేదింటి మహిళలకు ప్రతీనెలా 2500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండర్, రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడే ఇళ్లకు ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం. రైతు భరోసా కింద ప్రతీ ఏడాది రైతులకు 15000 రూపాయలు, కౌలు రైతులకు12000 రూపాయల ఆర్థిక సాయం, వరి పంట వేసే రైతులకు అదనంగా 500 రూపాయల బోనస్, సామాజిక పింఛన్లు నెలకు నాలుగు వేలకు పెంపు, వివాహం చేసుకునే అమ్మాయిలకు పది గ్రాముల బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు సాయం, ఎలక్ట్రిక్ కుక్కర్లు, సొంతిళ్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం. విద్యార్థుల కోసం ఐదు లక్షల రూపాయల విలువైన విద్యార్థి భరోసా కార్డు... ఇలా హామీల లిస్టు కొండవీటి చాంతాడంత ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, ఉద్యోగ నియామకాలు. ఇలా చెప్పుకుంటూ పోతే... బడ్జెట్లో వ్యయ జాబితా గగన సీమను తాకుతుంది.
ప్రస్తుతం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ట్రెండ్ నడుస్తోంది. గతంలోలా ‘తూచ్’ అంటామంటే కుదరదు. మ్యానిఫెస్టో చూపించి, పాలక పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకుంటూ.. సంక్షేమపాలన చేస్తే ఓకే. కానీ ఇన్ని పథకాలను భరించేలా... రాబడి మార్గాలు కనిపించడం లేదు. ఉచిత కరెంట్‌తో కర్నాటక పడుతున్న తిప్పలు చూస్తున్నాం. తెలంగాణ రథాన్ని రేవంత్ రెడ్డి ఎలా నడిపిస్తారో చూడాలి.