Sun Nov 24 2024 13:42:29 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త గవర్నర్ వద్దకు గన్నవరం ఘటన...?
కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలను చేపట్టిన వెంటనే గన్నవరం అంశం ప్రధానంగా మారనుంది.
రాష్ట్రానికి కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు రాబోతున్నారు. ఎల్లుండి ఆయన గవర్నర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. ఆయన బాధ్యతలను చేపట్టిన వెంటనే గన్నవరం అంశం ప్రధానంగా మారనుంది. విపక్షాలన్నీ కలసి కొత్త గవర్నర్ కు గన్నవరం ఘటనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త గవర్నర్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఉండటంతో ఆయన దృష్టికి తొలిసారి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను తేవాలని ప్రయత్నాలు చేయనున్నాయి. ఆయన తమకు న్యాయం చేస్తారని విపక్ష పార్టీలు నమ్ముతున్నాయి
విపక్షాలతో కలసి...
విజయవాడలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని విపక్షాలతో కలసి గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రాజ్‌భవన్ జోక్యం చేసుకుంటే కొంత లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే వామపక్ష పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడగా వారు రాజ్‌భవన్ కు వచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. గవర్నర్ వచ్చిన వెంటనే గన్నవరం అంశాన్ని తీసుకెళ్లి, పోలీసులు అనుసరిస్తున్న తీరును కొత్త గవర్నర్ కు చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
వీడియోలు.. ఫొటోలను...
గన్నవరంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వీడియోలు, ఫొటోలను ఈ సందర్భంగా గవర్నర్ కు ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించాలని భావిస్తున్నారు. దాడులు చేయడమే కాకుండా బాధితులపై కేసులు నమోదు చేయడాన్ని కూడా కొత్త గవర్నర్ దృష్టికి తేవాలని నిర్ణయించారు. గవర్నర్ కురాష్ట్ర ప్రభుత్వంపై ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ గా చూపించే ప్రయత్నంలో విపక్ష నేతలున్నారు.
ఆందోళనలకు...
గవర్నర్ ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా కొంత ఆందోళనలు చేయాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎదుట విపక్షాలు ప్రదర్శన చేయాలని నిర్ణయించాయి. గవర్నర్ ప్రమాణస్వీకారానికి విపక్ష నేతలను ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా విపక్షాలు భావిస్తున్నాయి. దీనిని పసిగట్టిన ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం అప్రమత్తమయిందని తెలిసింది. మొత్తం మీద కొత్త గవర్నర్ దృష్టికి తొలిసారి గన్నవరం ఘటనను తీసుకెళ్లాలన్న విపక్షాల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో లేదో? చూడాల్సి ఉంది.
Next Story