Mon Dec 23 2024 17:02:04 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీ పై దాడికి పీఎఫ్ఐ కుట్ర?
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రధాని మోదీ దాడికి కుట్ర చేసిందన్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రధాని మోదీ పై దాడికి కుట్ర చేసిందన్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. పాట్నాలో ప్రధాని పర్యటన సందర్భంగా దాడి చేయాలని పీఎఫ్ఐ కుట్ర పన్నిందని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జులై 12న ప్రధాని బీహార్ లోని పాట్నాలో పర్యటించారు. ఈ సందర్బంగానే ప్రధానిపై దాడి చేయాలన్న కుట్ర జరిగినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారని ఎన్ఐఏ జరిపిన విచారణలో వెల్లడయినట్లు సమాచారం.
భారీగా నిధుల సమీకరణ...
దీంతో పాటు ప్రధాని మోదీపై దాడి కోసం భారీ ఎత్తున నిధుల సమీకరణ జరిగిందని, 120 కోట్ల రూపాయలు నిధులు పీఎఫ్ఐ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఎన్ఐఏ గుర్తించింది. విదేశాలతో పాటు భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచి నిధులు చేరినట్లు సమాచారం. దేశంలో గత కొద్దిరోజులుగా జరుపుతున్న ఎన్ఐఏ దాడుల్లో ఈ విషయం స్పష్టమయింది. ప్రధాని మోదీ తో పాటు ఉత్తర్ప్రదేశ్ లోని కొందరు రాజకీయ ప్రముఖులపై కూడా దాడి చేయాలని కుట్ర జరిగిందని చెబుతున్నారు.
సోదాల్లో ఆసక్తికరమైన
దేశ వ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఎన్ఐఏ అధికారులు ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 105 మందిని అరెస్ట్ చేశారు. అత్యధికంగా కేరళ నుంచి 22 మందిని అరెస్ట్ చేశారు. వారిపై దేశద్రోహం కింద కేసులు పెట్టారు. వారికి ఉన్న సంబంధాలతో పాటు ఆర్థిక వ్యవహారాలపై కూడా ఈ సోదాలు చేశారు. ఈ దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని చెబుతున్నారు. ఇందుకోసం వందల సంఖ్యలో శిక్షణ ఇచ్చినట్లు కూడా ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు.
Next Story