Mon Dec 23 2024 18:38:18 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దాయనలో ఈ చాదస్తం ఏంటి?
ఈరోజు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నితీష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
రాజకీయ నేతలు ఒక వయసు వచ్చిన తర్వాత చాదస్తం పెరుగుతుంది. ఆ చాదస్తంతో కొన్ని నిర్ణయాల విషయంలో పిల్లిమొగ్గలు వేస్తారు. బీహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ పరిస్థితి కూడా అలాగే కనపడుతుంది. ఎందుకు ఆర్జేడీని వదిలిపెట్టారంటే అవినీతి పార్టీ అని వదిలేశానని ఆనాడు బయటకు వచ్చి బీజేపీని కౌగలించుకున్నారు. నాడు బీజేపీ సిద్ధాంతాలు, మోదీ, షా వ్యూహాలను తెలిసే నితీష్ కుమార్ ఆ పార్టీతో అంటకాగారు. బీజేపీ సాయంతో ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోగలిగారు. అప్పుడు బీజేపీ నితీష్ కు నీతిమంతమైన పార్టీగా కన్పించింది. ఈరోజు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నితీష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
తక్కువ స్థానాలొచ్చినా...
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలసి పోటీ చేశాయి. కానీ బీజేపీ కన్నా తక్కువ స్థానాలను జేడీయూ సాధించింది. అయినా ఎన్నికల వేళ మాట ఇచ్చినందుకు నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిని ఆ పార్టీ చేసింది. సహజంగా రాష్ట్ర బీజేపీలో అత్యధిక స్థానాలు సాధించుకున్నా ముఖ్యమంత్రి పదవి వదులుకున్నామనే అభిప్రాయం ఉంటుంది. ఆ కారణంగానే బీహార్ బీజేపీ నేతలు జేడీయూ అధినేత ముఖ్యమంత్రిని విమర్శిస్తారు. దానిని సీరియస్ గా తీసుకుని తిరిగి ఆర్జేడీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు.
ఇప్పుడు నీతి మంతంగా...
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులైన తేజస్వియాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లు అవినీతి చేశారంటూ నాడు బయటకు వచ్చిన నితీష్ కుమార్ నేడు ఆ పార్టీ నీతిమంతమైనదిగా ఎలా కనిపిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయమయిందని ప్రచారం జరుగుతుంది. ఆగస్టు 11వ తేదీకి ముందే బీజేపీతో తలాక్ చెప్పేందుకు నితీష్ కుమార్ సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. నీతి అయోగ్ సమావేశానికి కూడా నితీష్ కుమార్ డుమ్మా కొట్టడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
నీజాయితీగల నేతగా...
బీహార్ లో ఆర్జేడీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతుంది. లాలూ ప్రసాద్ కు చిరకాల మిత్రుడైన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా ముఖ్యమైన కేబినెట్ పోస్టులు తాము దక్కించుకోవాలని భావిస్తుంది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో కలసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాుటు చేయడానికి సిద్ధమవుతున్నారు. నితీష్ కుమార్ నిజాయితీ గల నేత. అవినీతి మచ్చ లేని లీడర్. అందులో ఎవరికీ సందేహం లేదు. కానీ అధికారం కోసం పిల్లి మొగ్గలు వేయడమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసినా దాని పెత్తనమే కొనసాగుతుంది. ఎందుకంటే శాసనసభలో ఆర్జేడీకే అత్యధిక స్థానాలున్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. మొత్తం మీద పెద్దాయనకు చాదస్తం పెరిగినట్లుందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.
Next Story