Mon Dec 23 2024 12:35:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి మరో తుపాను ముప్పు అవాస్తవం కానీ.. ఈ తేదీల్లో భారీవర్షాలు ఖాయం
ఈ వారానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షసూచన, తుపాను హెచ్చరికలు లేనప్పటికీ.. వచ్చేవారంలో అంటే డిసెంబర్ 19వ తేదీ..
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను.. డిసెంబర్ 9న తీరం దాటి.. ఆ తర్వాత వాయుగుండంగా మారి ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా.. డిసెంబర్ 15,16 తేదీల్లో మరో తుపాను వస్తుందని, ఏపీపై మరో తుపాను పంజా విసరనుందని వస్తున్న వార్తలను వాతావరణశాఖ ఖండించింది. ఆ వార్తలను నమ్మొద్దని, ప్రస్తుతానికి ఏపీ కి ఎలాంటి తుపాను హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
కాగా.. అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 24-48 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో గోవా, మహారాష్ట్ర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ వారానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షసూచన, తుపాను హెచ్చరికలు లేనప్పటికీ.. వచ్చేవారంలో అంటే డిసెంబర్ 19వ తేదీ, ఆ తర్వాత సుమత్రా దీవుల వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది క్రమంగా అల్పపీడనంగా బలపడుతుందని తెలిపింది. ఆ అల్పపీడనం శ్రీలంక వైపు కదిలితే ఏపీకి భారీ వర్షాల ముప్పు తప్పినట్లేనని, తమిళనాడు వైపుగా వస్తే మాత్రం తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది.
డిసెంబర్ 19వ తేదీ నుండి 29వ తేదీ మధ్యకాలంలో ఏపీలో దక్షిణ ప్రాంతంలో, గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాల్లో, తెలంగాణలో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story