Mon Dec 23 2024 13:01:30 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలంక దారుణ పరిస్థితులు.. అన్నపానీయాలు లేక అలమటిస్తున్న ప్రజలు
విద్యుత్ కొరత కారణంగా.. శ్రీలంకలో రోజుకు 10 గంటల పాటు కరెంట్ కోత విధిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ కోతలు ఉండటంతో..
శ్రీలంక పరిస్థితులు రోజులు గడిచే కొద్దీ మరింత దుర్భరంగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పడం లేదు. ఆర్థిక, ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్నంటడంతో..ఎంతో మంది ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. కావాల్సినంత ఇంధనం లేకపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తికీ ఆటంకం ఏర్పడుతోంది.
750 మెగావాట్ల విద్యుత్ కొరతతో శ్రీలంక సతమతమవుతోంది. విదేశాల నుంచి డీజిల్ వచ్చినప్పటికీ, డబ్బులు చెల్లించకపోవడంతో దాన్ని అన్ లోడ్ చేయలేకపోతున్నారు. మరోవైపు, డీజిల్ కొనుగోలు కోసం బంకుల వద్ద ఎవరూ బారులు తీరొద్దని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద మండుటెండలో క్యూ లైన్లలో నిల్చుంటున్నవారిలో పలువురు స్పృహ కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.
విద్యుత్ కొరత కారణంగా.. శ్రీలంకలో రోజుకు 10 గంటల పాటు కరెంట్ కోత విధిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ కోతలు ఉండటంతో.. రోడ్లపై విద్యుద్దీపాలు వెలగక అంధకారం అలుముకుంటోంది. రెస్టారెంట్లు కొవ్వొత్తుల వెలుగుల్లోనే వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి. ఔషధాల కొరత కూడా ఉండటంతో.. ఆస్పత్రులు అత్యవసరం కాని ఆపరేషన్లను వాయిదా వేస్తున్నాయి. కాగితం కొరత కూడా ఉండటంతో ఈనెలలో నిర్వహించాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశాయి విద్యాసంస్థలు.
Next Story