Wed Dec 25 2024 04:46:22 GMT+0000 (Coordinated Universal Time)
నిన్నటి వరకూ ఆశల్లేవ్.. కానీ ఈరోజు కేబినెట్ లోకి?
జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. మంత్రులకు కూడా తెలియకుండా నిర్ణయాలుంటాయి.
జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. మంత్రులకు కూడా తెలియకుండా నిర్ణయాలుంటాయి. ఇక తన నిర్ణయాల్లో ఎవరి ప్రమేయం పెద్దగా ఉండదు. అందుకే మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకునే విషయం కూడా చివరి నిమిషం వరకూ ఎవరికీ తెలియదు. ఆరోజు ఉదయం సీఎంవో నుంచి లీకులు వస్తే తప్ప అత్యవసర మంత్రి వర్గ సమావేశం ఉన్న విషయమూ తెలియలేదు. ఇలా ఉంటుంది జగన్ వ్యవహారం.
మండలి రద్దు నిర్ణయాన్ని....
ఇక జగన్ తీసుకున్న నిర్ణయంతో కొందరిలో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకూ శాసనమండలి సభ్యులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించే అవకాశం లేదని భావిస్తూ వచ్చారు. ఎందుకంటే శాసనమండలిని జగన్ రద్దు చేయడంతో పాటు మంత్రివర్గంలో ఉన్న ఇద్దరిని గతంలో తొలగించడమూ కారణం. అందుకే మండలి సభ్యులను త్వరలో జరగబోయే మంత్రివర్గంలో చోటు దక్కదని మొన్నటి వరకూ అనుకున్న మాట. కానీ అది నిన్నటి మాట.
పెద్దల సభలో....
జగన్ తాజాగా శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో దీంతో పెద్దల సభలో కొందరిలో ఆశలు పెరిగాయి. వచ్చినా రాకపోయినా తమ వంతు ప్రయత్నం చేసుకుంటే తప్పేంటన్న ఆలోచనలో ఉన్నారు. త్వరలో జగన్ మంత్రివర్గ సమావేశాన్ని విస్తరించే ీఅవకాశముంది. వచ్చే ఏడాది మొదట్లో విస్తరణ ఉండే అవకాశముందంటున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసన తర్వాత కొత్త మంత్రివర్గాన్ని జగన్ ఏర్పాటు చేయవచ్చు.
పెరిగిన ఆశలు...
పెద్దల సభలో మహ్మద్ ఇక్బాల్, పండుల రవీంద్ర, తోట త్రిమూర్తులు, దువ్వాడ శ్రీనివాస్ వంటి వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ అసలు ఆశలే లేవు. కానీ జగన్ శాసనమండలి రద్దు తీర్మానం వెనక్కు తీసుకోవడంతో మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీలను తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదంటున్నారు. మొత్తం మీద నిన్నటి వరకూ ఎలాంటి ఆశలు లేని నేతల్లో ఇప్పుడు ఒక్కసారిగా జగన్ నిర్ణయంతో ఉత్సాహం నెలకొంది.
Next Story