Fri Dec 27 2024 18:49:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మంత్రులు మాజీలు అయిపోయినట్లేనా?
ఏపీకి చెందిన మంత్రుల్లో ఐదారుగురు మినహా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వానికి అండగా నిలిచే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు. వారికి స్వేచ్ఛ లేదా? లేక మనకెందుకులే అని మౌనంగా ఉంటున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మందికి పైగానే మంత్రులున్నారు. వారి శాఖల విషయంలో మాట్లాడటం కూడా బహు అరుదుగా కన్పిస్తుంది. విపక్షాలు చేసే విమర్శలకు కొందరు మంత్రులు లేదా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే స్పందిస్తున్నారు.
ఐదారుగురు మాత్రమే....
ఏపీకి చెందిన మంత్రుల్లో ఐదారుగురు మినహా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వంటి వారు మాత్రమే మీడియాలో కన్పిస్తున్నారు. మిగిలిన మంత్రులకు వివాదాలకు, విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. హోంమంత్రి సుచరితను తీసుకుంటే వంగవీటి రాధా తన హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. అయితే దీనిపై ఆమె నుంచి స్పందన లేదు.
బీజేపీ విమర్శలకు....
బీజేపీ నేతలు జనాగ్రహ సభ పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంలోనూ స్పందించింది కొద్ది మంది మాత్రమే. అసలు ఏపీ మంత్రులకు ఏమయిందన్న చర్చ వైసీపీలో జరుగుతుంది. తమ జిల్లా, నియోజకవర్గాలకే ఎక్కువ శాతం మంది మంత్రులు పరిమితమయ్యారనిపిస్తుంది. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరుగుతుందన్న ప్రచారం ఉండటంతో ఇప్పుడు హడావిడి ఎందుకని కొందరు దూరంగా ఉంటున్నారు.
విస్తరణ వల్లనేనా?
జగన్ అధికారంలోకి రాగానే ఊహించని నేతలకు కూడా మంత్రులు పదవులు దక్కాయి. వారంతా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. ఆళ్లనాని, పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్ రెడ్డి, నారాయణస్వామి, శంకరనారాయణ వంటి వారు విపక్షాలు చేసే విమర్శలకు కనీసం కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఏపీ మంత్రి వర్గం ఉందంటున్నారు. జగన్ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారో తెలియదు కాని మంత్రులు మాత్రం తమకు తాము మాజీలుగానే ఊహించుకుంటున్నట్లుంది.
Next Story