‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి..?
తెలంగాణలో నోటా సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాలో ఒక పార్టీకి అనుకూలంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఎన్నికల సంఘానికి నిన్న ఫిర్యాదు అందింది. కాగా, కాంగ్రెస్ నేతలు కూడా సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సినిమా ప్రభావంతో ఓటర్లు నోటా బటన్ నొక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు గూడూరు నారాయణరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘం ముందు సినిమాను చూసి అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించాలని కోరారు. విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాపై కూడా అప్పట్లో కాంగ్రెస్ నేత వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టర్లు చించేసి రచ్చ చేశారు. దీంతో ఆ సినిమాకు మరింత పబ్లిసిటీ ఫ్రీగా వచ్చినట్లయింది.
అలాంటి సన్నివేశాలు లేవు
ఇక ఇదే వివాదంపై నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన నోటా పబ్లిక్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా జరుగుతున్నాయి.. అఫడవిట్లు పెడుతున్నారు. ఎలక్షన్స్ టైంలో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీ కి ఫేవర్ గా ఈ సినిమా ఉంటుంది అని అంటున్నారు. అలాంటి ఇష్యూస్ ఏవీ ఈ సినిమా లో లేవు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు. వాళ్లకు తెలుసు ఏం చేయాలో.. అక్టోబర్ 5న మీ అందరికీ ఓ కొత్త ఫ్రెష్ సినిమా ఇవ్వబోతున్నా.. నోటా ద్వారా పూర్తిగా సరికొత్త పొలిటికల్ ఎంటర్టైనర్ ని మీకు అందిస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు.