Mon Dec 23 2024 14:18:25 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరి బలం ఎంత? ఇప్పుడు అదే టాస్క్
ఇప్పుడు ఏపీలో పొత్తుల కోసం ఎత్తులు ప్రారంభమయ్యాయి. పార్టీని బలోపేతం చేసుకునేందుకు విపక్ష పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి
ఇప్పుడు ఏపీలో పొత్తుల కోసం ఎత్తులు ప్రారంభమయ్యాయి. పార్టీని బలోపేతం చేసుకునేందుకు విపక్ష పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలి? ఎవరు తగ్గాలి? ఎవరు నెగ్గాలి? అనే అంశమే ఎక్కువగా నలుగుతుంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనుకుంటున్న తరుణంలో ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత ఇరకాటంలో పడేశాయి.
పొత్తు పెట్టుకోవాలని....
2014లోనే పోటీ చేయకుండా పవన్ కల్యాణ్ తప్పు చేశారు. నాడు పోటీ చేసి ఉంటే కొంతలో కొంత శాసనసభలో ప్రాతినిధ్యం దక్కేది. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడేది. 2014లో పోటీకి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యునిస్టు పార్టీలతో కలసి పోటీకి దిగారు. కానీ ఒక్కసీటు మాత్రమే సాధించగలిగారు. ఆయన కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ భావించారు. టీడీపీ కూడా అదే అభిప్రాయంలో ఉంది.
పైచేయి కావాలని...
ప్రభుత్వ వ్యతిరేక చీలకుండా ఉండేందుకు పొత్తులు అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడుతున్నారు. కానీ జనసేన కొన్ని ప్రాంతాల్లోనే బలంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీ బలంగా లేదు. అందుకే పొత్తుల విషయానికి వచ్చే సరికి సహజంగా టీడీపీదే పై చేయి అవుతుంది. అత్యధిక స్థానాలతో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆ పార్టీ చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల నిర్వహించిన మహానాడు సక్సెస్ కావడంతో ఈ నెల 15వ తేదీ నుంచి చంద్రబాబు జిల్లాల యాత్ర ప్రారంభించారు. పార్టీ సత్తాను ప్రధానంగా జనసేనకు చూపడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను టీడీపీ జోరుగా చేపడుతుంది.
అక్టోబరు 5 నుంచి...
జనసేన ఇప్పటి వరకూ ఆ ప్రయత్నం చేయలేదు. అయితే అక్టోబరు 5వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేపడుతున్నారని రాజకీయ వ్యవహారా కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీని బలోపేతం చేసే దిశగానే పవన్ యాత్ర కొనసాగనుంది. విజయదశమికి యాత్ర పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభమవుతుంది. 2023 మార్చిలోనే ఏపీలో ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతో ముందుగానే విపక్షాలు ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. వైసీపీని ఎదుర్కొనేకంటే ముఖ్యంగా పొత్తులలో తమది పై చేయి కావాలన్నదే రెండు పార్టీల్లో స్పష్టంగా కన్పిస్తుంది. బల నిరూపణ కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పాలి.
Next Story