Sat Nov 23 2024 01:47:25 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలో ఎన్నారైలు ఎక్కువయ్యారా?
తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐలు క్యూ కడుతున్నారు. చంద్రబాబు కూడా కొన్ని చోట్ల ఎన్ఆర్ఐలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు
తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టాల్లో ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ ల కార్యక్రమాలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైరం పెట్టుకోవడంతో పెద్దగా ఫండ్స్ కూడా పార్టీకి చేరలేదు. దీంతో పాటు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారు.
ఫైనాన్షియల్ గా...
ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా బలమైన నేతలు అవసరం. అధికార వైసీపీని వచ్చే ఎన్నికల్లో తట్టుకోవాలంటే ఆషామాషీ కాదు. గత ఎన్నికల కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రచారం దగ్గర నుంచి ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించే వరకూ అయ్యే ఖర్చు కోట్లలోనే ఉంటుంది. అయితే పార్టీ పరంగా ఈసారి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు తప్పించి జనరల్ కేటగిరిలో ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిధులు అనుకున్నంత సమకూరే అవకాశం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాల్లో పలుమార్లు చెబుతూ వస్తున్నారు.
క్యూ కడుతున్న ఎన్నారైలు...
ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐలు క్యూ కడుతున్నారు. చంద్రబాబు కూడా కొన్ని చోట్ల ఎన్ఆర్ఐలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వారయితే కొత్త వ్యక్తి కావడం, డబ్బులు ధారాళంగా ఖర్చు పెట్టే స్థోమత కలిగి ఉండటంతో వారిని ఎంపిక చేయడం తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. నలభై శాతం యువత కోటాలో కూడా వీరిని ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల వరకూ అయ్యే ఖర్చును నియోజకవర్గాలకే కాకుండా పార్టీని రాష్ట్ర స్థాయిలో కొంత ఆదుకోవాలంటే ఎన్ఆర్ఐలు తప్పనిసరి అని చంద్రబాబు డిసైడ్ అయినట్లు కనపడుతుంది. వీకెండ్ లో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లినప్పుడు ఎన్ఆర్ఐలు వెళ్లి కలసి తమ భవిష్యత్ పై భరోసా పొందుతున్నారని పార్టీలో వినిపిస్తున్న టాక్.
వారికే అవకాశమా?
ఇప్పటికే తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవదత్ ను నియమించారు. ఆయన తనపని తాను చేసుకుపోతున్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానిని ఎదుర్కొనాలంటే వెనిగండ్ల రామును అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి కానుకల పేరిట ఆయన ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించిన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి కూడా ఉయ్యూరు శ్రీనివాస్ పేరు వినపడుతుంది. ఎస్ కోట నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ పేరు వినపడుతుంది. చంద్రబాబు ఇటీవల పర్యటన ఖర్చు మొత్తాన్ని కృష్ణమోహన్ ఖర్చు పెట్టుకున్నారని టాక్. దీంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు కూడా తాము పోటీ చేస్తామని ఎన్ఆర్ఐలు క్యూకడుతుండటంతో చివరి నిమిషంలో చంద్రబాబు టిక్కెట్ ఎవరికి ఇస్తారన్న టెన్షన్ పాత నేతల్లో వ్యక్తమవుతుంది.
Next Story