ఎన్టీఆర్ కి తప్పేలా లేదు..!
ఎప్పటినుండో చంద్రబాబు, బాలకృష్ణలు జూనియర్ ఎన్టీఆర్ ని పక్కనబెట్టేశారు. హరికృష్ణ కోసమే కళ్యాణ్ రామ్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఎన్టీఆర్ తో కలిసాడు కానీ... కళ్యాణ్ రామ్ కూడా దూరంగానే ఉండేవాడు. ఇక హరికృష్ణ మరణం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ చంద్రబాబు, బాలయ్యలకు దగ్గర చేసిందనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సక్సెస్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య పెద్దరికం వహించినా ఎక్కడో ఎన్టీఆర్ పట్ల విముఖత ఉన్నట్లే కనబడింది. ఇక హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబం నుండి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరుపున తెలంగాణ ప్రచారానికి వెళతాడని ప్రచారం జరిగింది.
కళ్యాణ్ రామ్ కి ఇవ్వాలనుకున్నా...
అయితే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ తరుపున ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ సంగతి పక్కనబెట్టి హరికృష్ణ కుటుంబంతో మునుపటి సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడు. అందుకే కూకట్ పల్లి నియోజకవర్గ స్థానాన్ని ముందు కళ్యాణ్ రామ్ కి ఇద్దామనుకుంటే కళ్యాణ్ రామ్ పాలిటిక్స్ వద్దన్నాడట. ఇక ఆయన భార్యను అడిగితే ఆవిడా వద్దనేసరికి హరికృష్ణ కూతురు సుహాసినిని తెరమీదకి తీసుకొచ్చారు. మొన్న వైజాగ్ వెళ్లి మామ చంద్రబాబుని కలిసి టికెట్ ఇచ్చినదుకు గాను కృతఙ్ఞతలు చెప్పిన సుహాసిని నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇంతవరకు ఎప్పుడూ సుహాసిని ఎక్కడా ఫోకస్ కాలేదు. హరికృష్ణ మరణం వరకు ఆయనకో కూతురు ఉన్నట్టు కూడా ఎవ్వరికి తెలియదు.
ప్రచారంలోకి దిగాల్సిందే...
అయితే ఈ రోజు నామినేషన్ వేయనున్న సుహాసినికి అండగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ఉంటారా? అసలింత వరకు సుహాసినికి సీటొచ్చిన విషయంపైనా అన్నదమ్ముల స్పందనే లేదు. అయితే టిడిపికి ఇప్పటి వరకు దూరమైన ఎన్టీఆర్ మాత్రం ఈసారి సుహాసిని కోసం ప్రచారానికి వచ్చేట్లుగా కనబడుతుంది. అంటే ఈసారి టీడీపీ ప్రచారానికి తప్పించినా, తప్పుకుందాముకున్నా ఎన్టీఆర్ కి జరిగేలా లేదు. మరి సుహాసిని నామినేషన్ వేసాక తన కుటుంబం అంటే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారం చేస్తారో లేదో మీడియాకి వివరిస్తానని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పింది. ఏది ఏమైనా ఈసారి ఎన్టీఆర్ కి మాత్రం ఈ ప్రచారం తప్పనట్టుగానే ఉంది. హరికృష్ణ మరణంతో సుహాసినికి సానుభూతి ఉన్నప్పటికీ... ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారం కూడా అవసరమవుతుంది కాబట్టి ఎన్టీఆర్ కి తప్పదు మరి.