Mon Dec 23 2024 16:18:35 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ కు కొత్త చికిత్స.. బ్రిటన్ లో ఆమోదం
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది ఒమిక్రాన్. ఈ కొత్త వేరియంట్ క్రమంగా అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెందుతోంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది ఒమిక్రాన్. ఇది డెల్టా వేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ క్రమంగా అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. భారత్ లోనూ ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. బూస్టర్ డోస్ వస్తే తప్ప.. ఇప్పటి వరకూ వేసిన టీకాలు ఒమిక్రాన్ కు అడ్డుకట్ట వేయలేవని డబ్ల్యూహెచ్ఓ చెప్పగా.. బూస్టర్ డోస్ కు మరికొద్ది నెలల సమయం పడుతుందని పలు వ్యాక్సిన్ల కంపెనీలు పేర్కొన్నాయి.
సరికొత్త యాంటీ బాడీ చికిత్స....
ఈ నేపథ్యంలో బ్రిటన్ కాస్త ఊరటనిచ్చే విషయం వెల్లడించింది. బ్రిటన్ కు చెందిన ఒక వైద్య నియంత్రణ సంస్థ 'ద మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ' కొవిడ్-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను ఆమోదించింది. ఈ చికిత్స ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేయవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీలతో తయారు చేసిన సోత్రోవిమాబ్ అనే ఔషధం కరోనా ఆట కట్టిస్తుంది.
12 ఏళ్ల వయసు పైబడిన...
ఈ ఔషధం వైరస్ పై కొమ్ము వలే ఉండే ప్రొటీన్ కు అంటుకుని మానవ శరీరంలోని కణాల్లోకి వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరిస్తుందని ఎంహెచ్ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనే తెలిపారు. తీవ్ర స్థాయి అనారోగ్యంతో ఉన్నవారిపై ఇది బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు ఇచ్చే ఈ సోత్రోవిమాబ్ ఔషధాన్ని 12 ఏళ్ల వయసు పైబడిన వారికి ఉపయోగించవచ్చని తెలిపారు. కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని ఈ ఔషధం రక్షిస్తుందని తమ క్లినికల్ పరీక్షల్లో వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు.
Next Story