Tue Dec 24 2024 02:43:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకో.. ఏమో.. ఏమయ్యిందో?
అమరావతి రైతుల పాదయాత్ర ఇంకా మొదలు కాలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆగిన యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు
అమరావతి రైతుల పాదయాత్ర ఇంకా మొదలు కాలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆగిన యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. హైకోర్టు తీర్పుతో తాము యాత్రను ప్రారంభిస్తామన్న రైతులు రోజులు గడిచినా ఇక ఇటు వైపు చూడటం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆగిపోయిన అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర ఆగిపోవడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. హైకోర్టును ఆశ్రయించినా పెద్దగా ఫలితం లేకపోవడం ప్రధాన కారణమయితే, పోను పోను ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని భావించి యాత్రకు కొంత సంకోచిస్తున్నారని సమాచారం.
అరవై రోజులు...
మొత్తం అరవై రోజులకు యాత్రను ప్లాన్ చేశారు. అన్ని జిల్లాలు, ముఖ్యమైన నియోజకవర్గాల నుంచి వెళ్లేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం హైకోర్టు 600 మంది వరకూ రైతులు పాల్గొన వచ్చని చెప్పింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పాదయాత్ర సజావుగా జరిగేలా చూడాలని పోలీసు శాఖను కూడా కోరింది. ఉమ్మడి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యాత్ర కొంత నిరసనల మధ్య జరిగింది. గుడివాడలో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా పోలీసులు భద్రత కల్పించి వారిని అక్కడి నుంచి యాత్ర సజావుగా జరిగేలా చూశారు.
టెన్షన్ ల మధ్య...
అనంతరం రాజమండ్రిలో మాత్రం కొంత ఇబ్బంది ఎదురయింది. ఏకంగా రైతులకు, వికేంద్రీకరణ కావాలనుకుంటున్న వారికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్ విసురుకున్నారు. అక్కడి నుంచి టెన్షన్ ప్రారంభమయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చేరుకునే సరికి అక్కడ పోలీసులు గుర్తింపు కార్డులు చూపమన్నారు. నాలుగు వాహనాల కంటే అనుమతించేది లేదని చెప్పారు. దీంతో తాము మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి యాత్రకు బ్రేక్ ఇచ్చేశారు. ఎక్కువ మంది గుర్తింపు కార్డులు లేకపోవడంతోనే పోలీసులు అభ్యంతరం చెప్పారన్న వార్తలు వచ్చాయి.
న్యాయస్థానంలోనూ...
మరోవైపు ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణకు అనుకూలంగా సభలు, ర్యాలీలు మొదలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చేరుకునే సరికి రైతుల యాత్ర 40 రోజుల వరకూ సాగింది. కానీ ఉద్రిక్తతలు తలెత్తడంతో కొంత వెనుకంజ వేశారు. అంతేకాకుండా న్యాయస్థానంలోనూ షరతుల్లో మార్పులు చేయబోమని చెప్పడంతో అమరావతి రైతుల యాత్ర ఊగిసలాటలో పడింది. నాలుగు రోజులు బ్రేక్ ఇస్తామని చెప్పిన రైతులు పక్షం రోజులు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. హైదరాబాద్ లో సమావేశాలు పెట్టుకుంటున్నారు. మొత్తం మీద అమరావతి రైతుల పాదయాత్ర తిరిగి కొనసాగుతుందా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
Next Story