Mon Dec 23 2024 09:38:35 GMT+0000 (Coordinated Universal Time)
పరిటాల, జేసీ ఫ్యామిలీ షరతులు... బాబుకు ఓకేనా?
అనంతపురం జిల్లాలో పరిటాల, జేసీ ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంది. ఈ రెండు కుటుంబాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. బలమైన నేతలున్న చోట పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కన్పిస్తుంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి బలమైన నేతలున్నప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో చంద్రబాబు సీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ పరిటాల, జేసీ ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంది. సామాజికవర్గపరంగా, ఆర్థికంగా, వర్గ పరంగా ఈ రెండు కుటుంబాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
జేసీ కుటుంబం...
ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అంటే ఇక్కడ కుదరదు. జేసీ ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి తాడిపత్రి అసెంబ్లీ, రెండోది అనంతపురం పార్లమెంటు స్థానం. ఆ కుటుంబంలో ఎవరిని పోట ీచేయిస్తారన్నది వాళ్ల ఇష్టమే. అలాగే ఇక పరిటా కుటుంబంలో కూడా రెండు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి ధర్మవరం కాగా, రెండోది రాప్తాడు నియోజకవర్గం. రాప్తాడులో గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
రాప్తాడు నుంచి....
ఇక ఈసారి రాప్తాడు నుంచి పరిటాల సునీతను పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. సునీత పట్ల సింపతీతో పాటు అనుకూలత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ప్రత్యేకంగా టీడీపీ చేయించిన సర్వేలోనూ పరిటాల సునీత అయితేనే గెలుస్తారన్న రిపోర్టులు వచ్చాయి. దీంతో చంద్రబాబు సునీతనే రాప్తాడు నుంచి పోటీ చేయాలని సంకేతాలు పంపారు. అందుకే ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
అందుకే శ్రీరామ్ ఇలా....
మరోవైపు ఇప్పటికే పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరిపోయారు. ఆయనకు తిరిగి టిక్కెట్ ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు లేరు. పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్లిన వారిని, వలసపక్షులకు టీడీపీలో చోటు ఉండదని చంద్రబాబు ఇప్పటికే చెప్పేశారు. దీంతో పరిటాల శ్రీరామ్ ఖచ్చితంగా టిక్కెట్ తనకే అని చెబుతున్నారు. పరిటాల శ్రీరామ్ తాజా వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. ధర్మవరంలోనే పోటీ చేస్తామని పరిటాల శ్రీరామ్ చెప్పడంతో దీనిపై క్లారిటీ వచ్చినట్లయింది.
Next Story