Thu Nov 21 2024 21:22:24 GMT+0000 (Coordinated Universal Time)
గోరంట్ల ఫ్యూచర్ కు నో గ్యారంటీ
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం వైసీపీని డ్యామేజి చేసింది. గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం నలుగుతుంది
గోరంట్ల మాధవ్ వ్యవహారం వైసీపీని డ్యామేజి చేసింది. గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం నలుగుతుంది. అయితే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని పోలీసులు తేల్చవచ్చు. ఒరిజినల్ దొరికితే కాని అసలు విషయం బయటకు వస్తుందని చెప్పడం నిజమే కావచ్చు. కానీ అప్పటికే ప్రజల్లో పార్టీ పూర్తిగా డ్యామేజీ అయిందనే చెప్పాలి. కురుబ సామాజికవర్గం ఆయనను వెనకేసుకు వచ్చినా పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడింది. పరువు, ప్రతిష్టలకు సంబంధించిన అంశం కావాడం, సున్నితమైన అంశం కావడంతో ప్రజలు ఎవరూ దీనిపై బయట పడకపోయినా కొందరి రాజకీయ పార్టీ నేతల పట్ల ఏహ్య భావం ఏర్పడిందని చెప్పక తప్పదు.
భవిష్యత్ లో ఆయన...
అయితే గోరంట్ల మాధవ్ ప్రస్తుతం పార్టీ అధినాయకత్వం వేటు నుంచి తప్పించుకున్నా, భవిష్యత్ లో ఆయనకు రాజకీయ అవకాశాలు తక్కువేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కురుబ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో వైసీపీ ఆయనపై చర్యలు దిగకపోవచ్చు. ఆ సామాజికవర్గం వ్యతిరేకమయితే హిందూపురంలోనే కాదు, అనేక నియోజకవర్గాల్లో వైసీపీ దెబ్బతినే అవకాశముందన్న అంచనాలు వినిపించడంతో పార్టీ అధినాయకత్వం వెనక్కు తగ్గిందని చెప్పాలి. గోరంట్ల మాధవ్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఆయనకు వ్యక్తిగతంగా జరిగే నష్టం కంటే పార్టీకి ఎక్కువ ప్రాంతాల్లో ఇబ్బంది ఏర్పడుతుందని గ్రహించింది.
పోలీసుల ద్వారా...
అందుకే సున్నితంగా ఉన్న ఈ సమస్యను పోలీసుల ద్వారా పక్కకు నెట్టే ప్రయత్నం జరిగిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే భవిష్యత్ లో మాత్రం పార్టీ అధినాయకత్వం గోరంట్ల మాధవ్ ను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచుతుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయనకు ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వైసీపీ నుంచి లభించకపోవచ్చు. పార్టీ హైకమాండ్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా మాధవ్ ను పార్లమెంటు సభ్యుడిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవులకే పరిమితం చేస్తారన్నది తాడేపల్లి క్యాంప్ నుంచి వినిపిస్తున్న టాక్.
ఇక ప్రత్యక్ష ఎన్నికలకు....
సామాజికపరంగా గోరంట్ల మాధవ్ ను దూరం చేసుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదు. అలాగని ఆయనను ప్రజల్లోకి మళ్లీ అభ్యర్థిగా పంపే యోచన కూడా చేయదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అది ఫేకో? నిజమో? తెలియదు. కానీ ప్రజల్లో మాత్రం పార్టీ చులకన అవ్వడంతో పార్టీ అంతర్గతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీంతో గోరంట్ల మాధవ్ లోక్సభలో ఇదే చివరి సారి అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ మాత్రం ఆయనకు ఏ ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని, పార్టీని ఇలా భ్రష్టు పట్టించిన సంఘటన మరొకటి లేదని వైసీపీ అధినేత కూడా అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద గోరంట్ల మాధవ్ వీడియో అసలా? నకిలీయా? అన్నది తేలినా ఫలితం మాత్రం ఆయన రాజకీయంగా అనుభవించక తప్పేలా కన్పించడం లేదు.
Next Story