Mon Dec 23 2024 15:53:47 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనకు ఒక అవకాశమివ్వండి
వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరారు. సిద్ధవటంలో జరిగిన కౌలు రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. సిద్ధవటం సిద్ధులు తిరిగిన ప్రాంతమన్నారు. రాయలసీమ అంతటా సిద్థులు తిరిగిన పవిత్ర ప్రాంతమని ఆయన తెలిపారు. తాను ఏ రోజు పదవుల కోసం ఆలోచించలేదని, మార్పు కోసమే తాను ఆలోచించానని చెప్పారు. బలమైన ఆలోచనలతో 2014లో జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. మార్పు కోసమే తాను జనసేనను స్థాపించానని చెప్పారు. ఒకే కుటుంబంలో అన్నా చెల్లి ఇద్దరు చెరి వేర్వేరు పార్టీలు పెట్టుకుంటే మిగిలిన సామాజికవర్గాల గురించి వారు ఆలోచించారా? అని ప్రశ్నించారు. రాయలసీమలోని మాల, మాదిగ, బోయ, కురుబల గురించి వీరు ఆలోచించారా? అని పవన్ ప్రశ్నించారు. తాను కోరుకుంటుందల్లా పేదరికంలో ఉండే ప్రజల్లో అన్ని విధాలుగా మార్పు రావాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
కులాలకు వ్యతిరేకం...
తాను కులానికి వ్యతిరేకమని తెలిపారు. ఒక కులానికి తాను కొమ్ముకాయనని చెప్పారు. వెనుకబడిన కులాలను గుర్తించి వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా చూడాలని అన్నారు. అగ్రవర్ణాల్లో కూడా వెనుకబాటుతనం ఉందన్నారు. తాను జనసేన పార్టీని అమ్మడానికి రాలేదని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలను దాటి మానవత్వాన్ని నమ్మే వ్యక్తిని అని పవన్ అన్నారు. పేదరికానికి కులం లేదన్నారు. కులరాజకీయాలు చేేసేందుకు జనసేనను స్థాపించలేదన్నారు. పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తుందని పవన్ కల్యాణ్ మండి పడ్డారు. కౌలు బాధిత కుటుంబాల్లో రెడ్లే అధికమని ఆయన చెప్పారు. 25 సంవత్సరాలు రాజకీయాల్లోకి ఉండేందుకే పార్టీ పెట్టానని అన్నారు. సొంత బాబాయి చనిపోతే ఇంత వరకూ నిందితులను ఎందుకు పట్టుకోలేదన్నారు. ఎక్కడా కులం లేదు, కుటుంబం లేదని, కేవలం రాజకీయాల్లో వ్యక్తిగతమేనని ఆయన తెలిపారు.
సీమ అభివృద్ధి చెందాలంటే...
2018లోనే రాయలసీమలో తాను అనేక మంది పెద్దలను కలిశానని పవన్ కల్యాణ్ చెప్పారు. జగన్ వైసీపీకి ముఖ్యమంత్రిగా తప్ప ఏపీకి వ్యవహరించడం లేదన్నారు. చివరకు తన సోదరుడు చిరంజీవిని కూడా చేతులు జోడించి నమస్కరించే స్థాయికి తీసుకు వచ్చాడని, ఆధిపత్య ధోరణిని అందరూ ఖండించాలన్నారు. మోదీ సొంత కొడుకులా భావిస్తున్నప్పుడు జగన్ స్టీల్ ప్లాంట్ ను కడపలో ఎందుకు పూర్తి చేయడం లేదు అని ప్రశ్నించారు. కేసుల కోసమే కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. జనసేనను ఒకసారి నమ్మమని ఆయన కోరారు. రాయలసీమకు చెందిన ఏ ముఖ్యమంత్రి దీనిని బాగుచేయలేదన్నారు. గత నవంబరు నెలలో వచ్చిన వరదలకు కూడా ప్రభుత్వం ఇంత వరకూ సాయం చేయలేదన్నారు. మార్పు కోసం జనసేన ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఆశీస్సులు ఇవ్వాలని ఆయన కోరారు.
Next Story