Mon Nov 18 2024 03:34:23 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డిని కాంగ్రెస్ బుజ్జగిస్తుందా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై పార్టీ హైకమాండ్ చర్యలకు దిగడం లేదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై పార్టీ హైకమాండ్ చర్యలకు దిగడం లేదు. పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తున్నా చర్యలకు సిద్ధపడటం లేదు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తక్షణ చర్యలకు దిగలేకపోతుందన్నది స్పష్టమవుతుంది. నిన్న కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్, పీీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి చర్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీసుకునే నిర్ణయం తీసుకోలేదు.
మరొక నేత అయితే...?
మరొక నేత అయితే ఈ పాటికి కాంగ్రెస్ చర్యలకు దిగి ఉండేది. ఎమ్మెల్యేగా ఉండటం, బలమైన నేత కావడంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఆయన గత కొద్ది రోజులుగా బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఎదగలేదంటున్నారు. కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని పదే పదే చెబుతున్నారు. అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది.
బీజేపీలో చేరడం...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నారు. ఉప ఎన్నిక వచ్చినా తనదే గెలుపు ఖాయమన్న ధీమాతో కోమటిరెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు మునుగోడు నుంచి వార్ ప్రారంభమవుతుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట. రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలిచి బీజేపీకి మరింత హైప్ తేవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.
ఇంకా చర్చలతోనే...
కానీ కాంగ్రెస్ మాత్రం ఎలాంటి చర్యలకు దిగడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇంకా బుజ్జగించాలనే యోచనలోనే ఆ పార్టీ నేతలు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో బీజేపీకి బలమైన నేతను ఇవ్వడం ఇష్టం లేక చివరి నిమిషం వరకూ ఆయన వెళ్లకుండా ఉండేలా ప్రయత్నించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడు ముహూర్తం అనేదే తేలాల్సి ఉంది. వచ్చే నెలలో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చేరిక అప్పుడు ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Next Story