Mon Dec 23 2024 19:45:58 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి ఆ రెండింటికి దూరమేనా?
మునుగోడు ఎన్నిక ప్రచాాారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండటంపై పార్టీ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.
మునుగోడు ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. నామినేషన్ల కార్యక్రమం కూడా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ప్రచారానికి దూరంగా ఉండటంపై పార్టీ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. తన సోదరుడు బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో ఆయన ఏవో కారణాలు చూపి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకు ఆయన చెప్పే కారణాలు కూడా సహేతుకంగా లేవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. పైగా ఆయనను పార్టీ అధినాయకత్వం స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది.
సాకులు చెబుతూ...
తనను వ్యక్తిగతంగా దూషించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే తాను పార్టీ ప్రచారానికి రాలేకపోతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించి క్షమాపణలు కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయినా దానిని పట్టుకుని తాను ప్రచారానికి రానని చెప్పడం తగదని అంటున్నారు. ఎవరో ఏదో అన్నారని పార్టీని దూరం చేసుకుంటామా? అని ప్రశ్నిస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్వయంగా వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలసి మద్దతు కోరారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పానంటున్న కోమటిరెడ్డి ఆమెను సపోర్టు చేస్తూ ప్రచారానికి మాత్రం వెళ్లలేకపోతున్నారు.
కాంగ్రెస్ లోనే కొనసాగుతానని...
మరోవైపు తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీని తాను వీడనని చెబుతున్న కోమటిరెడ్డి వైఖరి ఎవరికీ అంతుబట్టడం లేదు. పార్టీ తనంతట తాను సస్పెండ్ చేయాలని చూస్తున్నారా? లేక ఈ ఎన్నిక ప్రచారానికి వెళ్లి సోదరుడికి దూరం కావడం ఇష్టం లేకనే ఈ సాకులు చెబుతున్నారా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిందే. అందుకు ఆయనకు పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి సారీ చెప్పారు. అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను ప్రచారానికి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో ఎన్నికకు జరుగుతుంటే దూరంగా ఉండటం పార్టీ హైకమాండ్ కూడా తప్పుపడుతుంది.
జోడో యాత్రకు....
ఇక మునుగోడు ఉప ఎన్నికలను పక్కన పెడితే త్వరలో తెలంగాణలో జరుగుతున్న రాహుల్ భారత్ జోడోయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉంటారా? పాల్గొంటారా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. జోడో యాత్రకు సంబంధించి అనేక సమావేశాలు జరుగుతున్నా ఆయనకు పిలుపులు ఉన్నాయో లేవో తెలియదు. ఆయన ఈ యాత్రకు దూరంగా ఉంటారా? లేదో కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలంగాణకు ఈ నెల 23వ తేదీన వస్తున్నారు. ఆయన 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. దీనికి ఒకవేళ హాజరయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని క్యాడర్ నుంచి అధినాయకత్వం వరకూ ఎలా చూస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇటు సోదరుడిని వదులుకోలేక కోమటిరెడ్డి కుంటి సాకులు చెబుతున్నారని పార్టీ నేతలు అంతర్గతంగా విమర్శిస్తున్నా ఆ స్థానంలో ఎవరు ఉన్నా అదే చేస్తారని కోమటిరెడ్డి సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇటు మునుగోడు ఉప ఎన్నిక, అటు భారత్ జోడో యాత్ర తలనొప్పిగా మారక తప్పదంటున్నారు.
Next Story