Mon Dec 23 2024 10:38:31 GMT+0000 (Coordinated Universal Time)
శభాష్.. జగన్ ముగ్గురూ రెడ్లే....సూపర్ డెసిషన్
క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు.
అవును.. పార్టీ గుర్తు మీద గెలిచి ఇతర పార్టీకి మద్దతిచ్చే వారికి తగిన గుణపాఠం ఇది. గెలిచినా, ఓడినా పార్టీని అంటిపెట్టుకుని ఉంటేనే అంకిత భావంతో ఉండాలి. విధేయత ఎంత ముఖ్యమో... పార్టీ పట్ల అంకితభావమూ అంతే అవసరం. రాజకీయాల్లో ఈ రెండూ అవసరం. అందునా ప్రాంతీయ పార్టీల్లో ఈ రెండూ లేకుంటే నేతలుగా ఎదగలేరు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అది అవసరం. నమ్మకంగానే ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు నేరం. నిజానికి పార్టీ అధినాయకత్వం అంటే ఇష్టం ఉండకపోవచ్చు. పార్టీ విధానాలు నచ్చక పోవచ్చు. సిద్ధాంతాలు ఇబ్బంది కలగవచ్చు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచి సంప్రదాయం.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు...
కానీ నేటి రాజకీయాల్లో అలాంటి వాళ్లకు తావుండదు. ప్రాంతీయ పార్టీల్లో అధినేత చెప్పిందే వేదం. అది టీడీపీ అయినా.. వైసీపీ అయినా ఏ పార్టీ అతీతం కాదు. అందుకు సర్దుకుపోయే వాళ్లే అందులో ఉండాలి. జగన్ ఈ పనిని నాలుగు నెలలు ముందే చేసి ఉంటే ఈ ఎన్నికల్లో ఓటమి అవమానాలు ఎదుయ్యేవి కావు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం భరించాల్సి వస్తే చివరకు అవమానమే మిగులుతుంది. నాలుగు నెలల క్రితమే పార్టీని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే నిన్న మరో ఇద్దరు ఈ పరిస్థితికి పాల్పడే వారు కాదు. సస్పెన్షన్ కు భయపడే వారు. కానీ జగన్ ఆలస్యం చేేసినందుకే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.
ఈ ఇద్దరూ...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు కొంత కాలం నుంచే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించారు. అది మిగిలిన వారికి అలుసుగా మారింది. ఇక ఏడాది కాలం మాత్రమే ఎన్నికలు ఉండటం, తమకు టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో రావని కన్ఫర్మ్ కావడంతో మరో ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని నట్టేట ముంచారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కొన్నేళ్లుగా థిక్కార స్వరం వినిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం మిగిలిన వారు కూడా తమపై చర్యలు తీసుకోరన్న విశ్వాసంతో ఉన్నారు. అందుకే కోడ్ పెట్టినా, గుర్తు పెడతారని భావించినా నిన్నటి నుంచి మేకపాటి, ఉండవల్లి ఇద్దరూ బొంకుతూనే ఉన్నారు. తాము పార్టీకి కట్టుబడి ఉన్నామని చెబుతూనే ఉన్నారు. రహస్య ఓటింగ్ కావడంతో తమ గట్టు రట్టు కాదని భావించారు.
ఈ ఇద్దరూ మాత్రం...
పార్టీకి వెన్నుపోటు పొడవటం సామాన్య విషయం కాదు. అందునా ఉండవల్లి శ్రీదేవికి పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చి జగన్ ఎమ్మెల్యేను చేశారు. అటువంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఎవరూ హర్షించరు. అందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. అయితే ఇందులో ముగ్గురు నెల్లూరు జిల్లాలకు చెందిన వారే. ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. నెల్లూరు జిల్లా జగన్ కు కంచుకోట. గత ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి ప్రాంతం నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారంటే ఇకపై జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. మంత్రి పదవి తమకు దక్కలేదని కొందరు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని మరికొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అందరికీ తెలుసు. ఇంకా చర్యలు తీసుకోకపోతే జగన్ నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది. జగన్ ఆలస్యం చేయకుండా తీసుకున్న నిర్ణయం పార్టీ క్యాడర్ లో జోష్ నింపిందనే చెప్పాలి.
Next Story