Fri Dec 27 2024 20:15:41 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాల ఫార్ములా.. మునుగోడు స్ట్రాటజీ అంతేనా?
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో గెలిచిన పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. ఓడిన పార్టీలకు నష్టమేదీ ఉండదు
మునుగోడు ఉప ఎన్నికల ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై ఉంటుందా? ఇప్పుడు గెలిచిన పార్టీకి అడ్వాంటేజీ ఉంటుందా? ఓడిన పార్టీని జనం ఆదరించరా? అంటే అవునని చెప్పడానికి లేదు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో గెలిచిన పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. ఓడిన పార్టీలకు నష్టమేదీ ఉండదు. ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలు సెమీ ఫైనల్స్ కానే కాదు. ప్రత్యేక పరిస్థితుల్లోనే మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నిక కావడం, అక్కడ అన్ని శక్తులు మొహరించడం వల్ల కొన్ని పార్టీలకు ఎక్కువ ఓట్లు రావచ్చు. ఇంకొన్ని పార్టీలకు డిపాజిట్లు దక్కకపోయి ఉండవచ్చు.
వచ్చే సాధారణ ఎన్నికలలో..
కానీ ఇవేమీ వచ్చే సాధారణ ఎన్నికల ఫలితాల్లో చూపవు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నిక ఇందుకు నిదర్శనం. 2017లో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే, శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వచ్చ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులను మండలాల వారీగా మొహరించింది. ఎమ్మెల్యేలను ఇన్ఛార్జులుగా నియమించింది. చివరకు టీడీపీ అభ్యర్థి దాదాపు 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఫార్ములా పనిచేయకపోగా...
దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో నంద్యాల ఫార్ములా అని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నంద్యాల ఫార్ములాను అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే 2019 లో వైసీపీ అక్కడ గెలిచింది. అంతేకాదు రాష్ట్రంలోనూ వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నంద్యాలలోనే శిల్పా రవిచంద్రారెడ్డి దాదాపు ముప్ఫయి వేల మెజారిటీతో గెలిచారు. అంటే నంద్యాల ఫార్ములా తర్వాత సాధారణ ఎన్నికల్లో అదే నంద్యాలలో పనిచేయలేదన్నది స్పష్టంగా తెలిసింది.
మునుగోడు అంతే...
ఇక మునుగోడు ఉప ఎన్నికను కూడా అంతే చూడాలి. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావచ్చు. దానిని ఎవరూ కాదనలేరు. ఆపలేరు కూడా. ప్రజలు మొగ్గు చూపితే ఎవరైనా అధికారంలోకి వచ్చే వీలుంటుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఎవరికీ ఒరిగేదేమీ లేదన్నది వాస్తవం. కాకుంటే అధికారంలో ఉన్న పార్టీకి మరో ఎమ్మెల్యే వచ్చి చేరారు. అంతే తప్ప మునుగోడు విజయంతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని ఎవరూ అంచనా వేయలేరు. మొన్న జరిగిన హుజూరాబాద్ లో గెలిచిన బీజేపీ నిన్న జరిగిన మునుగోడులో గెలవలేకపోయింది. ఉప ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు పొంతన లేదు. ఏ ఫార్ములా పనిచేయదు. అప్పటి ట్రెండ్ ను బట్టి ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే వీలుందన్నది వాస్తవం.
Next Story