బాబూ పద్ధతి మార్చుకో...లేకుంటే...?
2014లోనే తమకు బలం ఉన్నా ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయవద్దని చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని, అయినా ఒక్క పదవి కూడా అడగలేదని జనసేన పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అబద్ధాల హామీలతో రగిలి రగిలి జనసేన ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన కవాతులో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సాధన కోసం అఖిలపక్ష కమిటీ వేయాలని, ఢిల్లీకి వెళ్లి నిలదీద్దామని పేర్కొన్నారు. ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధమైతే నేనూ సిద్ధమే అని పేర్కొన్నారు. బెదిరింపులకు తాను భయపడనని, లక్షలాధి మందితో ప్రజా ఉద్యమాలు సృష్టిస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, ఒళ్లు దగ్గరపెట్టుకుని పాలన చేయాలని హెచ్చరించారు.
పవన్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు...
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఎక్కడ చూసిన అవినీతి, అన్యాయాలు రాజ్యమేలుతున్నాయి. జన్మభూమి కమిటీ గ్రామాల్లో దోచుకు తింటున్నాయి. ఈ దౌర్జన్యాలను వెంటనే ఆపాలి. లేకపోతే దౌర్జన్యాలను చీల్చిచెందాడే కొదమసింహాలు మా జనసైనికులు.
- ముఖ్యమంత్రి గానీ, ప్రతిపక్ష నేత గానీ ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తే నేను ప్రజాస్వామ్యబద్ధంగానే యుద్ధం చేస్తాను. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే జనసేన ప్రజా ఉద్యమాల ద్వారా ప్రవాహంలో కలిపేస్తాం.
- ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లోకి తీసుకొస్తే గోదావరిలో కలిపేస్తాం.
- జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక చంద్రబాబు నాయుడు నా మద్దతు కోరితే ఇచ్చాను. కానీ, ఇవాళ చంద్రబాబు ఆ విషయాన్ని మర్చిపోయారు.
- సర్పంచ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. చెక్ పవర్ సర్పంచ్ లకు ఇస్తాం. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేస్తాం.
- నన్ను సినిమా యాక్టర్ అంటారు... మరి లోకేష్ కి ఏం తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని లోకేష్ ను పంచాయతీ శాఖ మంత్రిగా ఎలా చేశారు..?
- పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను వాడుకుని ముఖ్యమంత్రి ఒక టెర్రరిజం తయారుచేస్తున్నారు. యువతకు కోపం వస్తే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- రాజకీయ జవాబుదారీతనం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. మోది పాచిపోయిన లడ్డులు ఇచ్చారని నేను చెబితే, చంద్రబాబు అవే లడ్డులను మైక్రోఓవెన్ లో పెట్టుకుని తిన్నారు. బీజేపీని దుమ్మెత్తిపోసింది నేను. అటువంటి నేను బీజేపీతో కలుస్తానా..?
- దేశప్రధానిగా నరేంద్ర మోదీని గౌరవంతో మాట్లాడతా... కానీ గులాంగిరి చేసి బీజేపీని వెనకేసుకుని రాను.
- ఎవరో పారిశ్రామికవేత్తల మీద ఐటీ దాడులు చేస్తే నేనుందుకు మద్దతు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కార్యాలయంపై ఐటీ దాడులు చేస్తే కచ్చితంగా ప్రభుత్వానికి అండగా ఉంటాను.