Wed Jan 08 2025 00:40:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆప్షన్లు మూడే.. టార్గెట్ ఒక్కటే
పవన్ కల్యాణ్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఆయన ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఆయన ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఇది వందశాతం వాస్తవం. ఈసారి పొత్తులు ఉన్నప్పటికీ తగ్గకూడదన్నది కింది స్థాయి క్యాడర్ నుంచే కాకుండా పార్టీలో నేతల నుంచి డిమాండ్. అభిమానులతో పాటు కాపు సామాజికవర్గం ఈసారి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ప్రతిసారి వేరే వారి కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని పార్టీ క్యాడర్ ఏకాభిప్రాయంగా చెప్పుకోవాలి. పర్చూరు సభలో ఆయన స్పష్టం చేశారు.
తగ్గాలని చెప్పి....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు ముందుంచారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి తాను సిద్ధమని ఒక రకంగా ఓపెన్ అయ్యారు. ఈసారి వేరే వాళ్లు తగ్గాలని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ తొలుత పొత్తుల గురించి ప్రస్తావన తేవడంతో టీడీపీ అప్రమత్తమయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసేంత నేత కాదు. ఆయన తనకున్న అనుభవం, పరిపాలన దక్షత వంటివి పదే పదే తమ పార్టీ నేతలతో చెప్పిస్తుండటం ఇందుకు సంకేతాలని చెప్పాలి. అయితే పర్చూరు నుంచి పవన్ కల్యాణ్ టీడీపీకి హెచ్చరిక జారీ చేశారు. తాను పొత్తుకు సిద్దంగా లేనని, ఒంటరిగా పోటీ చేస్తానని, తనను ఆదరించి, ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఒకరకంగా టీడీపీకి ఇది తాను పొత్తుకు సిద్ధంగా లేనన్న వార్నింగ్ గానే చెప్పుకోవాల్సి ఉంటుంది.
లొంగకూడదని...
కానీ పవన్ కల్యాణ్ కూడా ఈసారి పట్టుదలతో ఉన్నారు. తాము ఈసారి లొంగిపోతే తమ ఓటు బ్యాంకుకు పూర్తిగా నష్టపోతామని భావిస్తున్నారు. చంద్రబాబును మరోసారి సీఎం చేయడానికి పవన్ కు ఎందుకు ఓటు వేయాలన్న భావన క్యాడర్ లోనూ, ప్రధాన సామాజికవర్గంలోనూ కలిగితే తనకు దీర్ఘకాలంగా నష్టం తప్పదు. ఈసారి ఓటమి పాలయినా తనకు ప్రత్యేకంగా జరిగే నష్టమేమీ లేదు. తనకు వయసు ఉంది. భవిష్యత్ లో ఓటు బ్యాంకు పెంచుకునే వీలుంది. అందుకే పవన్ ఈసారి తగ్గకూడదనే నిర్ణయించుకున్నారని తెలిసింది.
బంతి టీడీపీ కోర్టులో....
దీంతో జనసేన పోటీ చేస్తే బీజేపీతో కలసి పోటీ చేస్తుంది. లేకుంటే ఒంటరిగానైనా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయడమే మేలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. బీజేపీతో పెద్దగా టచ్ లో లేనట్లే కన్పిస్తుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లోనూ జనసేన జెండా బీజేపీ అభ్యర్థి ప్రచారంలో కనపడడటం లేదు. పవన్ కూడా అక్కడకు ప్రచారానికి వస్తారన్న నమ్మకం లేదు. జనసేన క్యాడర్ కు పూర్తి స్థాయిలో సిగ్నల్స్ వెళ్లడంతోనే జెండాలు పక్కన పెట్టేశారంటున్నారు. దీంతో పవన్ ఈసారి ఒంటరిగా పోటీ చేేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను అంగీకరిస్తేనే పొత్తు కుదురుతుంది. ఇది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులో ఉంది. టీడీపీ సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తేనే పవన్ పొత్తుకు సిద్దమవుతారు. ఇది ఫిక్స్.
Next Story