Mon Dec 23 2024 11:58:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎవరితో పొత్తులేదు.. ప్రజలతోనే పొత్తు
చాలాసార్లు ఎవరెవెరికో అవకాశాలు ఇచ్చారని, ఈసారి తాము నిలబడతామని ఆదరించమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కల్యాణ్ కోరారు
చాలాసార్లు ఎవరెవెరికో అవకాశాలు ఇచ్చారని, ఈసారి తాము నిలబడతామని ఆదరించమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కల్యాణ్ కోరారు. ప్రజలతోనే తనకు పొత్తు అని, ఇంక ఎవరితో పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. చంద్రబాబుకు తాను దత్తపుత్రుడిని కానని పవన్ కల్యాణ్ అన్నారు. వెనక్కు వెళ్లేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. 2014లో తాను పోటీకి దిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావని ఆయన అన్నారు. నన్ను దత్తపుత్రుడిని అని వైసీపీ విమర్శిస్తుందని, తాను కూడా సీబీఐ దత్తపుత్రుడని అనగలనని పవన్ అన్నారు. పర్చూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించిన పవన్ 76 రైతు కుటుంబాలకు లక్ష రూపాయలకు చెక్కులు అందచేశారు. ఏ హామీలు అమలు పర్చలేని అసమర్థ ప్రభుత్వమిది అని పవన్ అన్నారు.
సంస్కారహీనంగా...
వైసీపీ నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. తనను నమ్మాలని, ఆలోచించాలని పవన్ కోరారు. మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పుచేసిందని, దానిని ఎక్కడ ఖర్చు చేసిందని ప్రశ్నించారు. రోడ్ల దుస్థితిపై ప్రశ్నిస్తే జనసైనికులపై కేసులు పెడుతున్నారన్నారు. లక్షల కోట్లు అడ్డగోలుగా తినేస్తున్నా ప్రశ్నించకూడదన్న ధోరణిని కనపరుస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదన్నారు.
ఎమ్మెల్యేలను రీకాల్ చేయాల్సిందే...
నిండామునిగి పోయినోడికి చలేముందన్న సామెత ఉంది. రాజకీయాల్లోనే ఉంటా. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాజకీయాల్లో ఉంటానని పవన్ చెప్పారు. ఎమ్మెల్యేలను రీకాల్ చేసే పద్ధతిని తీసుకురావాలన్నారు. మాట ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేలు నిలబెట్టుకోవాలని పవన్ కోరారు. ప్రత్యేకహోదా తెస్తామని కబుర్లు చెప్పి ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. వచ్చే ఎన్నికలు కీలకమన్నారు. నిరుద్యోగులకు జనసేన అధికారంలోకి వస్తే జాబ్ క్యాలండర్ ప్రకటిస్తానని చెప్పారు. రైతు ప్రయోజనాలను కాపాడతామని చెప్పారు.
ఆదరించండి... ఆశీర్వదించండి....
జనసేన ప్రారంభినప్పటి నుంచి ఇప్పటి వరకూ సానుకూల పరిస్థితుల్లో లేమని, వ్యతిరేక పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పారు. బాధ్యత కలిగిన వ్యక్తులను శాసనసభకు పంపించేంత వరకూ రాష్ట్ర పరిస్థితుల్లో మార్పులు రావన్నారు. కొత్త నాయకత్వాన్ని జనసేన తీసుకువస్తుందని అన్నారు. ఒకసారి జనసేన వైపు చూడాలని, గుడ్డిగా నమ్మక్కర్లేదని, ఆలోచించమని పవన్ అన్నారు. తనకు డబ్బు అవసరం లేదని, తన ప్రభుత్వంలో అవినీతి ఉండదని పవన్ చెప్పారు. ప్రకాశం జిల్లాకు నీటిపారుదల సౌకర్యాలను కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. జనసేనను ఆదరించాలని, ఆశీర్వదించాలని పవన్ కోరారు. దసరా నుంచి తాను ప్రజల్లోనే ఉంటానని పవన్ కల్యాణ్ అన్నారు.
Next Story