వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తాం.... ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం
2024 ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
2024 ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల్లో ఈ ప్రభుత్వం ముంచేసిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థిితి కూడా లేదన్నారు. ఏపీలో ఎందుకు ఉపాధి అవకాశాలు లేవన్నది ఆలోచించుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేందుకు ఇష్టపడటం లేదన్నారు. ఉన్న పరిశ్రమలను ఉన్మాదంతో తరిమేస్తున్నారన్నారు. ఐఎంఎల్ అంటే ఇండియన్ మేడ్ లిక్కర్ కాదని ఇడుపులపాయ మేడ్ లిక్కర్ అని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారమదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ కొమ్ములు విరుస్తామని, వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్థామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే జనసేన ఆవిర్భావ సభ లక్ష్యమని చెప్పారు. బీజేపీ పెద్దలు రూట్ మ్యాప్ ఇస్తామని చెప్పారని, అందుకోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. వైసీపీ వ్యతిరేకశక్తులు అన్నీ కలవాలని పవన్ ఆకాంక్షించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రస్తక్తి ఉండదన్నారు. అప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు.