Mon Dec 23 2024 18:17:36 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరం.. 2024లో గద్దె దించండి
స్టీల్ ప్లాంట్ ప్రయవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరే అభ్యంతరకరంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరే అభ్యంతరకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపాలని పవన్ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోరాడి సాధించుకున్నామని, దానిని ప్రయివేటీకరించడం అంటే పోరాటానికి విలువ లేకుండా చేయడమేనని అన్నారు. తనకు ఒక్క ఎమ్మెల్యే ఉంటేనే కేంద్రం గౌరవం ఇస్తుందని, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ ప్రభుత్వానికి కేంద్రం ఎందుకు విలువ ఇవ్వదని పవన్ ప్రశ్నించారు.
అమరావతి రాజధాని...
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ను నిరసిస్తూ దీక్ష చేసిన పవన్ కల్యాణ్ విరమించిన అనంతరం మాట్లాడారు. గత ఏడాది బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తాను అమరావతి రాజధానిగా ఉండాలని కండిషన్ పెట్టానని పవన్ గుర్తు చేశారు. అందుకు బీజేపీ నాయకత్వం కూడా అంటీకరించిందని, అందుకే తిరుపతిలో అమిత్ షా అమరావతి రాజధాని అని చెప్పారన్నారు. చట్టసభల్లో తనకు సభ్యులు ఉంటే తానే వెళ్లి మాట్లాడి ఉండేవాడినని చెప్పారు.
2024 ఎన్నికల్లో ....
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరమని, అందుకే 2024లో వైసీపీకి ఓటు వేయవద్దని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దామోదర సంజీవయ్య రాసిన అంశాన్ని తెలిపారు. వర్షపు చుక్క పై నుంచి పెనం మీద పడితే ఆవిరవుతుందని, అదే ఆకుమీద పడితే నీటి బొట్టుగా మారుతుందని, ఆల్చిప్పలో పడితే ముత్యం అవుతుందని తెలిపారు. ఆ చినుకే ఓటు అని, వైసీపీ పెనం అని గుర్తుంచుకోవాలన్నారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలని, వైసీపీ చేసే ప్రతి పనిపై వారి చేత సమాధానం చెప్పిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
మాజీ సీఎం సతీమణి...
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు అండగా జనసేన నిలబడుతుందన్నారు. రైతులకు సంబంధించి ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసి వారి సమస్యలపై దృష్టి పెడతామని చెప్పారు. ఎవరి బెదిరింపులకు తాను భయపడబోనన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యనే అసెంబ్లీలో దూషించడం సరికాదన్నారు. ఇక సామాన్య ఆడపిల్లలకు రక్షణ ఏం ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తన సినిమాలను ఆపి తన ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అయినా తాను భయపడపోనని చెప్పారు. అంత పంతానికి వస్తే ఏపీలో తన సినిమాలను ఉచితంగా చూపిస్తానని చెప్పారు. సినిమా టిక్కెట్ల విషయంలో పారదర్శకత లేదంటున్న వైసీపీ మద్యం అమ్మకాల్లో ఉందా? అని ఎద్దేవా చేశారు.
Next Story