Sat Nov 16 2024 09:31:18 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ రోడ్ మ్యాప్ అదేనా?
బీజేపీ పెద్దలు తనకు రోడ్డు మ్యాప్ ఇస్తానన్నారని, అందుకోసం వెయిట్ చేస్తున్నానని ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే రాజకీయ పార్టీల హడావిడి కన్పిస్తుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ పార్టీని ఓడించేందుకు పాలిటికల్ పార్టీలకు మెంటర్ గా మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పక్షాలను జగన్ కు వ్యతిరేకంగా ఏకం చేసి ఎన్నికల్లో నిలవాలన్నది జనసేనాని ఆలోచన. అయితే ఆయన బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.
పవన్ ను వదులుకోవడం...
బీజేపీ పెద్దలు తనకు రోడ్డు మ్యాప్ ఇస్తానన్నారని, అందుకోసం వెయిట్ చేస్తున్నానని పవన్ చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకుని వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తే ఈసారి గెలుపు గ్యారంటీ అన్నది పవన్ నమ్మకం. కానీ బీజేపీ అధినాయకత్వం ఆలోచన ఎలా ఉందో తెలియదు. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందుకు వస్తుందా? రాదా? అన్నది కొంత సంశయమే. అయితే పవన్ ను వదులుకోవడం ఇష్టంలేని బీజేపీ ఒక షరతుతో టీడీపీని కూటమిలోకి తీసుకునేందుకు అంగీకరిస్తుందన్న అంచనాలు ఢిల్లీ నుంచి విన్పిస్తున్నాయి.
బాబుపైన....
2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు బీజేపీ పెద్దలపై దుమ్మెత్తి పోశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన దేశ వ్యాప్తంగా తిరిగి కూటమి ఏర్పాటుకు ప్రయత్నించారు. ఆ పరిణామలను మోదీ, షాలు మరిచిపోలేదంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతు కూడా అవసరమే. అందుకోసం బీజేపీ పెద్దలు కొత్త షరతును విధించే అవకాశముందని తెలుస్తోంది. సీట్ల పంపకాల్లో ప్రాధాన్యత మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి పదవి పై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశముంది.
సీఎం అభ్యర్థిగా....
పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీతో జతకట్టడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పవన్ తమ పార్టీ కాదని, ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమితో జగన్ ఎదుర్కొనవచ్చన్న సూచనలు చేయవచ్చు. దీనికి చంద్రబాబు ఎటూ అంగీకరించరు. పవన్ కల్యాణ్ కూడా తనపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించిన బీజేపీ అధినాయకత్వానికి దూరం జరిగే పరిస్థిితి ఉండదు. అందుకే ఎన్నికలు సమీపించే తరుణంలో పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ షరతు విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
- Tags
- pawan kalyan
- bjp
Next Story