Mon Dec 23 2024 17:07:08 GMT+0000 (Coordinated Universal Time)
లీడర్ అంటే పవన్ ను చూపకూడదా?
మరోసారి టీడీపీతో జత కడతానని పరోక్షంగా పవన్ కల్యాణ్ సంకేతాలు ఇవ్వడం క్యాడర్ లో నిరుత్సాహం కలిగించింది.
అవును.. సినిమాల్లో నటించినంత సులువు కాదు రాజకీయాల్లో రాణించడం. నిత్యం ప్రజల్లో ఉంటేనే అక్కడ సక్సెస్ సాధ్యమవుతుంది. సినిమాలను కారవాన్ లో కూర్చుని సక్సెస్ చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో నమ్మకం, ప్రజల్లో నిరంతరం ఉంటేనే సక్సెస్ లభిస్తుంది. ఇది ఎప్పుడో ఎక్కడో చూసి చెప్పింది కాదు. మన కళ్లముందే అనేక మంది సినీహీరోలు రాజకీయ పార్టీలు పెట్టి రాణంచలేకపోయారు. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ జనసేన అంశం కూడా చర్చనీయాంశమైంది.
అనేక మంది పార్టీలు...
పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత ఏమయిందో అందరికీ తెలిసిందే. ఏపీలో ఒక్క ఎన్టీఆర్ కు తప్ప మరే సినీనటుడికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దక్కలేదు. అంతెందుకు పొరుగున ఉన్న తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి రెండు ఎన్నికల్లోనూ జీరో రిజల్ట్ సాధించారు. లక్షల సంఖ్యలో అభిమానులున్న రజనీకాంత్ సయితం రాజకీయాల్లో సమయం వెచ్చించలేక ఏకంగా పార్టీ పెట్టే ఆలోచననే విరమించుకున్నారు.
ప్రజలతో మమేకం అయిన వారే..
సినిమాలతో సంబంధం లేకపోయినా, ప్రజల్లో పెద్దగా పరిచయం లేకపోయినా రాజకీయాల్లో రాణించగలిగిన వారు లేకపోలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఆ కోవలోకి చెందిన వారే. కేవలం నిత్యం పార్టీని ప్రజల్లో ఉంచడం, ఆయనపై ఉన్న విశ్వసనీయతే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండరు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు జనంలోకి వస్తారు. వచ్చి నాలుగు సినిమా డైలాగులు చెప్పి, ఊగిపోతూ ఉపన్యాసం చెప్పి వెళ్లిపోతారు. ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేస్తానని చెప్పి పత్తాలేకుండా పోతాడు. ఇది పవన్ పై ప్రజలకు ఉన్న అభిప్రాయం.
ఎప్పుడు ఎలాంటి నిర్ణయం?
నిజానికి జనసేన పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు. మరి అప్పుడు ఎవరి చరిష్మాయో తెలియదు కాని ఆ కూటమి గెలవడంతో టీడీపీ విజయంలో తన పాత్ర ఉందని పవన్ ఇప్పటికీ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వ్యతిరేకించారు. కమ్యునిస్టులు, బీఎస్పీతో కలసి ప్రయాణాన్ని సాగించి బొక్కబోర్లా పడ్డారు. ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీ పంచన చేరారు. ఆయన ఇప్పటికీ బీజేపీ అధినాయకత్వం గీచిన గీత దాటని పరిస్థితి. ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన మాట్లాడటం లేదంటే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ బీజేపీని వెనకేసుకు వస్తున్నారన్న టాక్ వినపడుతుంది.
జెండాలను మారుస్తూ....
ఇప్పుడు మరోసారి టీడీపీతో జత కడతానని పరోక్షంగా పవన్ కల్యాణ్ సంకేతాలు ఇవ్వడం క్యాడర్ లో నిరుత్సాహం కలిగించింది. నాయకుడనే వాడు తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాలి. అంతేకాని అవతలివాడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పనిచేయమని క్యాడర్ కు పిలుపు ఇవ్వకూడదు. ఇప్పటి వరకూ ప్రజల్లోనే పవన్ కు విశ్వసనీయత లేదు. ఇప్పుడు క్యాడర్ లో కూడా ఆలోచన బయలుదేరింది. ఎన్నిక ఎన్నికకు ఇలా పార్టీలు మారుస్తుండటం ఆయన రాజకీయ పరిణితికి అద్దం పడుతుంది. నాయకుడు కావాలని కోరుకునే వాడు తానే సాధించాలనుకుంటాడు. స్వయం శక్తి లేని వాడే ఇతరులపై ఆధారపడతారు. పవన్ కూడా అంతే. ఒంటరిగా జగన్ ఓడించలేమని నమ్మి అందరినీ ఏకం చేస్తానని ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరో మూడు నెలల వరకూ మళ్లీ పవన్ క్యాడర్ కు కూడా అందుబాటులోకి రారు. కేవలం పవన్ ది రాజకీయాల్లో ఒక్కరోజు సినిమాయే.
Next Story