Thu Nov 28 2024 22:51:31 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ అదే ప్రయత్నంలో ఉన్నారా?
పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనపై ఉన్న ఆ ముద్రను తొలగించుకునేందుకే ఆయన ఇటీవల తరచూ చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. రేవంత్ పై చంద్రబాబు ముద్ర ఉంది. దానికి ఎవరూ కాదనలేరు. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వచ్చారు. పార్టీలు మారడం తప్పు కాదు. కానీ టీడీపీలో ఉన్న నేతలకే పదవులు దక్కడం కూడా ఈ ఆరోపణలకు ప్రధాన కారణమయింది. ఆయన వ్యతిరేకులు కూడా వీలుచిక్కినప్పుడల్లా చంద్రబాబు ముద్ర వేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బంది కరమే.
బాబు ముద్ర నుంచి...
అయితే ఇటీవల చంద్రబాబు ముద్ర నుంచి బయటపడేందుకు రేవంత్ సమయం చిక్కినప్పుడల్లా వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడూ లేనిది చంద్రబాబు పై రేవంత్ చేసిన విమర్శలు కూడా ఈకోణంలోనే చూడాలి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ వర్క్‌షాప్ లో రేవంత్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు తానే దేశంలో అనుభవమున్న నేతగా విర్రవీగారని, కానీ 2004లో ప్రజలు ఆయనను ఇంటికి పంపించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
బాబుపై విమర్శలు...
చంద్రబాబు తనకు తానుగా ఎక్కువగా ఊహించుకున్నారని, ప్రజాగ్రహం వస్తే ఎవరూ ఆ కుర్చీలో నిలవరని అన్నారు. దీనికి తోడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్లనే నాడు కాంగ్రెస్ ను ప్రజలు ఆశీర్వదించారన్నారు. వైఎస్ పాదయాత్రతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు తనకు పదవులపైన మక్కువ లేదని, పీసీసీ చీఫ్ గా ఎవరు వచ్చినా తాను నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇటు చంద్రబాబుపై విమర్శలు, అటు వైఎస్ పై ప్రశంసలు రేవంత్ నోటి నుంచి రావడంతో కాంగ్రెస్ శ్రేణులే అవాక్కయ్యాయి.
కొత్త ఇన్‌ఛార్జి రాకతో...
రేవంత్ చరిష్మా ఉన్న నేత. మంచి మాటకారి. ఆయన మాట్లాడే మాటలు జనంలోకి సూటిగా వెళతాయి. అయితే సొంత పార్టీలో ప్రత్యర్థులు కావచ్చు. కాంగ్రెసేతర పార్టీ నేతల కావచ్చు. రేవంత్ తెలుగుదేశం పార్టీ వాసనలు పోలేదని, గ్రూపులు కట్టి ముఖ్యమైన నేతలను వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బురదజల్లించి వారిని బద్నాం చేసి వారంతట వారే పార్టీని వీడి వెళ్లిపోయేలా చేసేవారని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ ముద్రను చెరిపేసుకునేందుకు ఇప్పుడు రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. మాణికం ఠాగూర్ ను మార్చడం ఒకరకంగా రేవంత్ కు ఇబ్బందే. కొత్త ఇన్‌ఛార్జి వచ్చి ఎన్ని మెలికలు పెడతారో అన్నది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది.
Next Story