Sat Nov 23 2024 17:09:18 GMT+0000 (Coordinated Universal Time)
అతి పెద్ద హైవే.. నేడు ప్రారంభం
దేశంలో అతిపెద్ద జాతీయ రహదారిని నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ - ముంబయి హైవేను ప్రారంభించనున్నారు.
దేశంలో అతిపెద్ద జాతీయ రహదారిని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 2019లో శంకుస్థాపన చేసిన ఈ రహదారిని జాతికి అంకితం చేయనున్నారు. ముంబయి - ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. దీని ప్రయాణ కాలం తగ్గడమే కాకుండా సౌకర్యవంతంగా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 1,386 కిలోమీటర్ల పొడవున్న అతిపెద్ద హైవేను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించింది.
లక్ష కోట్లు...
ఇందుకు లక్ష కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో ముంబయి - ఢిల్లీ మధ్య 180 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 24 గంటలు కాగా, ఈ హైవే నిర్మాణంతో పన్నెండు గంటలకు చేరనుంది. మొత్తం ఎనిమిది లేన్లగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. తొలిదశలో సోహ్నా - చౌసా మధ్య నిర్మించిన రహదారిని ప్రధాని ప్రారంభించనున్నారు.
ప్రయాణ సమయం...
ముంబై - ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే దాదాపు ఆరు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లనుంది. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది. మొత్తం ఎనిమిది లైన్లున్న ఈ రహదారిలో ఒక లైన్ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే కేటాయించనున్నారు. మొత్తం 94 రకాల సేవలను ఈ జాతీయ రహదారిపై అందుబాటులోకి తెస్తున్నారు. హోటళ్లు, ఆసుపత్రులు, హెలిప్యాడ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రహదారి వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ముఖ్యంగా సరుకు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
Next Story