Mon Dec 23 2024 15:43:35 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకెంతకాలం వెయిటింగ్?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడటం ఖాయంగా కనిపిస్తుంది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీని వీడే అవకాశాలున్నాయి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడటం ఖాయంగా కనిపిస్తుంది. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన పొంగులేటి తర్వాత నాటి టీఆర్ఎస్ లోకి మారిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టిక్కెట్ నిరాకరించింది. ఇప్పటి బీఆర్ఎస్ ఆయనను పట్టించుకోవడం మానేసింది. రాజ్యసభ ఇస్తారనుకున్నా అటువంటి సంకేతాలు పార్టీ హైకమాండ్ నుంచి వినిపించడం లేదు. కనిపించడం లేదు. ఆయన వర్గాన్ని కూడా పక్కన పెట్టేసింది.
పార్టీ హైకమాండ్ పట్టించుకోక...
కొన్ని రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరు కాకపోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతగా ఉన్న పొంగులేటి కోసం మిగిలిన పార్టీలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లు తమ పార్టీలోకి రావాలని ఎప్పటి నుంచో ఆహ్వానాలు పంపతున్నాయి. మధ్యలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి కూడా ఆయన తన రాజకీయ భవిష్యత్ పై చర్చించి వచ్చారు. జగన్ ను తన రాజకీయ గురువుగా పొంగులేటి భావిస్తారు. జగన్ చెప్పినందుకే ఇప్పటి వరకూ బీఆర్ఎస్ లో వెయిట్ చేశారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు.
రాజకీయ భవిష్యత్....
తనతో పాటు తన అనుచరులకు కూడా రాజకీయ భవిష్యత్ లేదని ఆయన భావిస్తున్నారు. 2014లో తనతో పాటు వైసీపీ నుంచి పినపాక నియోజకవర్గం నుంచి గెలిచిన పాయం వెంకటేశ్వర్లుకు సయితం టీఆర్ఎస్ టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు లేవు. అక్కడ కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. కేటీఆర్ పుట్టిన రోజు నాడు కూడా కోటి రూపాయల సరుకులను పేదలకు పంపిణీ చేశారు. అయినా అధినాయకత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు పొంగులేటికి అందలేదు. దీంతో ఆయనపై అనుచరుల వత్తిడి కూడా ప్రారంభమయింది. ఇంకెంత కాలం వెయిట్ చేయడం అన్న నినాదంతో పొంగులేటి అనుచరులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.
కొత్త ఏడాది తొలిరోజున....
నూతన సంవత్సరం రోజున తన వర్గం నేతలకు, కార్యకర్తలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయవిందును ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని, నాలుగేళ్లుగా మనకు దక్కిన గౌరవం ఏంటో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. తాను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని, మూడు జనరల్ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన అనుచరులు కూడా జిల్లాలో పోటీ చేస్తారని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి ఏ పార్టీలోకి వెళుతున్నారు? బీజేపీలోకా? కాంగ్రెస్ లోకా? అన్న చర్చ మొదలయింది. బీఆర్ఎస్ సరైన అవకాశం ఇవ్వకుంటే పొంగులేటి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది.
Next Story