పొంగులేటి ఫోకస్ అయ్యారుగా..!
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని, మళ్లీ గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా కార్యాచరణతో సిద్ధమైంది. అందులో భాగంగా ప్రజలు తమవైపే ఉన్నారనే సంకేతాన్ని బలంగా తీసుకెళ్లేందుకు ప్రగతి నివేదన సభను వేదికగా చేసుకుంటున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపడుతున్న ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందిని సమీకరించాలని కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఇక జన సమీకరణలో ఎక్కడా ఫెయిల్ కాకుండా పార్టీ పెద్దలు నాయకులకు మార్గనిర్దేశం చేశారు. టార్గెట్లు పెట్టి మరీ జన సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఎన్నికల ముంగిట జనసమీకరణ చేసి తమ సత్తా చాటుకోవాలని, అధిష్ఠానం దృష్టిలో పడాలని ప్రస్తుత ప్రజా ప్రతినిధులతో పాటు టిక్కెట్ల ఆశావాహులు కూడా ఇప్పటికే తలమునకలయ్యారు.
ఎడ్ల బండ్ల స్థానంలో ట్రాక్టర్లలో...
ఇందులో ముందున్నారు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వృత్తిరిత్యా కాంట్రాక్టరైన పొంగులేటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లే అయినా రాజకీయాలను బాగా ఒంటబట్టించుకున్నారు. సభకు దిశానిర్దేశం చేయడానికి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్యంగా ఊరికో ట్రాక్టర్ చొప్పున 10 వేల ట్రాక్టర్లలో ఎక్కువగా రైతులను సభకు తరలించాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ సమ్మక సారక్క జాతరకు ఎక్కువగా ఎడ్లబండ్లు కట్టుకుని ప్రజలు వస్తుంటారు. బహుశా ఇదే మనస్సులో పెట్టుకుని జాతరకు వచ్చినట్లుగా మీటింగ్ కు రావాలని కేసీఆర్ భావించినట్లున్నారు. అయితే, అన్ని జిల్లాల నుంచి ఎడ్లబండ్ల మీద ఇంతదూరం తీసుకురావడం సాధ్యం కాదని, ఎడ్ల బండ్ల స్థానంలో ట్రాక్టర్లను పెట్టాలని నిర్ణయించినట్లున్నారు. కేసీఆర్ ఆలోచనను మొట్టమొదట అందుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఖమ్మం జిల్లా నుంచి ‘రైతు చైతన్య యాత్ర’ పేరుతో 1850 ట్రాక్టర్లలో రైతులను సభకు తరలిస్తున్నారు.
పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో హైలైట్ గా...
ఈ ట్రాక్టర్ ర్యాలీ నిన్ననే ఖమ్మం నుంచి బయలుదేరింది. ట్రాక్టర్ ట్రాలీలపై టీఆర్ఎస్ ఫ్లెక్సీలతో కప్పు మాదిరిగా తయారుచేయించి బయలుదేరారు. అన్ని ట్రాక్టర్లు ఒక్కచోట ఉండటంతో కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దీంతో చూడటానికి కూడా ఇది భారీగా కనపడుతోంది. పైగా డ్రోన్ కెమెరాలతో వీటి విజువల్స్ చిత్రీకరించి పత్రికలు, టీవీలకు వదిలారు. దీంతో ఇవాళటి ప్రతికల్లో ఈ ర్యాలీ ఫోటోలు భారీగా ప్రచురితమయ్యాయి. టీవీల్లో కూడా గంటల తరబడి ఈ విజువల్స్ చూపిస్తున్నారు.
తుమ్మల చేతే ప్రారంభం...
అయితే, ట్రాక్టర్లలో జనాలను ఎక్కించడం నిబంధనలకు విరుద్ధమని, ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా విమర్శలను పక్కన పెడితే, రాజకీయ నేతకు ఉండాల్సిన దూకుడును ప్రదర్శించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో పాటు పార్టీ హైకమాండ్ దృష్టిలో బాగానే ఫోకస్ అయ్యారు. ఏకంగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఖమ్మంలో తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోనే ఈ ర్యాలీని ప్రారంభించుకోవడం మరో విశేషం. ఆర్థికంగా బలవంతుడిగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశం కలిసి వస్తే మంత్రి కావాలని ఆశిస్తున్నారు.