పొన్నాల హ్యాపీ..! మరి కోదండరాం..?
ఎట్టకేలకు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రయత్నాలు ఫలించాయి. ఆయన తన స్వంత నియోజకవర్గం జనగామ టిక్కెట్ కోసం గత నాలుగు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి పొన్నాల లక్ష్మయ్యకే టిక్కెట్ అనేది అందరికీ తెలిసిందే. కానీ, పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని తెలంగాణ జన సమితికి కేటాయిస్తున్నారని, ఇక్కడి నుంచి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. టీజేఎస్ సైతం ఈ స్థానం కోసం పట్టుబట్టింది. అయితే, సీనియర్ బీసీ నాయకుడినైన తనకు టిక్కెట్ ఇవ్వకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పొన్నాల అధిష్ఠానం వద్ద వాదించారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో టిక్కెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన కోదండరాంతో జనగామ సీటును వదులుకోవాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పొన్నాలకు కాంగ్రెస్ అధిష్ఠానం లైన్ క్లియర్ చేసింది. తనకే టిక్కెట్ ఇవ్వనున్నట్లు ఆయనకు హామీ ఇచ్చింది.