ప్రభాస్ పిటీషన్ పై హైకోర్టు విచారణ
హైదరాబాద్ రాయదుర్గంలోకి తన గెస్ట్ హౌజ్ సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. తాము ప్రైవేటు వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొన్నామని, తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని ప్రభాస్ పిటీషన్ లో పేర్కొన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఆస్తిని సీజ్ చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రాయదుర్గం లోని పాన్ మక్తలో ఉన్న స్థలం ప్రభుత్వ భూమి అని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మీ స్థలం పాన్ మక్తలోనిదేనా అని కోర్టు పిటీషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి అవునని, అందులోనే 2087 గజాల స్థలం తమదని పిటీషనర్ పేర్కొన్నారు. అయితే, ఈ స్థలంపై గతంలో తీర్పు చెప్పిన డివిజన్ బెంచ్ కి ఈ కేసును బదిలీ చేయాలని ప్రభుత్వం తరపు అడ్వకేట్ కోరగా... కేసును డివిజన్ బెంచ్ కు బదిలీ చేశారు. రేపు డివిజన్ బెంచ్ లో ప్రభాస్ పిటీషన్ పై విచారణ జరగనుంది.