ప్రజాకూటమి c/o ఢిల్లీ
ప్రజాకూటమి ఏర్పాటు వ్యవహారం ఢిల్లీకి చేరింది. హైదరాబాద్ లో ఎన్నిసార్లు సమావేశాలు జరిగినా... సీట్ల పంపకాలపై అనేక చర్చలు జరిపినా కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో కూటమిలో మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ జన సమతి, సీపీఐ నేతలు కాంగ్రెస్ వైఖరిపై పెదవి విరుస్తున్నారు. ఓ వైపు టీఆర్ఎస్ ఇప్పటికే 90 శాతం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం.. వారంతా నెలరోజులుగా ప్రచారం చేసుకుంటుండటంతో కూటమి పార్టీలు ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాయి. దీంతో ఇక ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతోనే తేల్చుకోవాలని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు - రాహుల్ గాంధీ భేటీలో తెలంగాణలోని సీట్ల సర్దుబాటు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, రాజా, నారాయణ తదితరులు కూడా కాంగ్రెస్ పెద్దలను కలిశారు. మరోవైపు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంను కూడా రాహుల్ గాంధీ ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
టీజేఎస్ తోనే అసలు పేచీ
ప్రజాకూటమిలో ప్రధానంగా టీజేఎస్ తో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది పడుతోంది. ఆ పార్టీ 25 స్థానాలను డిమాండ్ చేస్తూ చర్చలు ప్రారంభించింది. ఆఖరికి ఆ పార్టీ ఇప్పుడు కనీసం 15 స్థానాలు కచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే, టీజేఎస్ కు అన్ని స్థానాలు ఇచ్చుందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. కొత్త పార్టీకి, ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తిగా బలోపేతం కాని పార్టీకి అన్ని సీట్లు ఇస్తే అది టీఆర్ఎస్ కు కలిసివచ్చే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ వాదన. అయితే, 10కి లోపు స్థానాలు తీసుకుంటే టీజేఎస్ ఎప్పటికీ చిన్న పార్టీగానే మిగిలిపోతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. టీజేఎస్ కు 6 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకు గానూ కోదండరాంను రాహుల్ గాంధీతో సమావేశపరిచాలని నిర్ణయించారు. ప్రజా కూటమి అధికారంలోకి వస్తే కోదండరాంకు కీలక బాధ్యతలు ఇవ్వాలని, ఆయన ప్రధానంగా కోరుతున్న కామన్ మినిమం అజెండా అమలు బాధ్యతలు కూడా ఆయనకు ఇస్తామనే హామీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.
సీపీఐకి స్థానాలు ఖాళీ లేవు...
ఇక సీపీఐ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆ పార్టీ మొదట ఏకంగా 16 సీట్లు డిమాండ్ చేయగా ఇప్పుడు ఇప్పుడు కనీసం 6 స్థానాలైనా ఇవ్వాలని పట్టుబడుతోంది. కాంగ్రెస్ మాత్రం 3 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఏయే స్థానాలు కేటాయిస్తారనేది ఇప్పుడు గందరగోళంగా మారింది. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్న హుస్నాబాద్ స్థానాన్ని కూడా వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇక నల్గొండలో ఆ పార్టీ దేవరకొండ, మునుగోడు, ఆలేరు స్థానాలు ఆశిస్తుండగా మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. వారు ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఇక ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం స్థానాలు కచ్చితంగా కావాలని సీపీఐ అడుగుతోంది. అయితే, సీపీఐ తో పొత్తు కారణంగా ప్రతీ ఎన్నికల్లోనూ తామే త్యాగాలు చేస్తున్నామని, ఈసారి ఆ పార్టీకి ఖమ్మంలో సీట్లు ఇస్తే ఊరుకునేది లేదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు తెగేసి చెబుతున్నారు. దీంతో సీపీఐకి ఏయే స్థానాలు కేటాయిస్తారనేది ఎంతకీ ఫైనల్ కావడం లేదు.
ఓల్డ్ సిటీ మాకొద్దు...
సీట్ల పంపిణీలో మరో ఆసక్తికర అంశం ఉంది. టీడీపీ, టీజేఎస్ పార్టీలకు తలా రెండు స్థానాలు పాతబస్తీలోని ఎంఐఎం ప్రభావ ప్రాంతంలో ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఓడిపోయే స్థానాలు తమకు ఇస్తామని చెప్పడంపై టీజేఎస్ ప్రధానంగా అసంతృప్తి ఉంది. ఇచ్చేదే కొన్ని స్థానాలు కాగా అందులోనూ ఓడిపోయే స్థానాలు ఇవ్వడం ఏంటని టీజేఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీట్ల పంపకాలపై కూటమిలోని అన్ని పార్టీలకూ అసంతృప్తి ఉన్నా బలమైన నాయకుడిగా ఉన్న కేసీఆర్ ను గద్దె దించాలంటే కూటమి ఏర్పాటు తప్పదనే ఏకైక కారణంతో కూటమి నుంచి బయటకు రావద్దని భావిస్తున్నాయి.