Sat Nov 16 2024 03:57:22 GMT+0000 (Coordinated Universal Time)
టన్నుల కొద్దీ ఇగో.. జగన్ వేటు వేసింది అందుకే?
ప్రవీణ్ ప్రకాష్ చీఫ్ సెక్రటరీలను కాదని ఉత్తర్వులు జారీ చేసేవారు. ఈ ఉత్తర్వులు ఇవ్వడం కొన్ని సార్లు వివాదమయింది.
ప్రవీణ్ ప్రకాష్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత ఇష్టమైన అధికారిగా అనతికాలంలోనే పేరు పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన సీఎం కోటరీలో సభ్యుడిగా చేరిపోయారు. ఐఏఎస్ అధికారి అయినా ప్రవీణ్ ప్రకాష్ చెప్పిందే జరగాలి. తొలుత ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారు. అక్కడ కూడా జగన్ ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారంటారు.
అవినీతి ఆరోపణలు లేకున్నా...
ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు పెద్దగా లేకున్నా ఇగో మాత్రం టన్నుల కొద్దీ వేసుకుని తిరుగుతాడన్నది ప్రతీతి. సీఎంవోలో ఉన్నప్పుడు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవనిచ్చే వారు కాదంటారు. ఇక ఎమ్మెల్యేల సంగతి సరే సరి. ఏదైనా నియోజకవర్గ సమస్యలుంటే తాను మాత్రమే వాటిని విని, వినతి పత్రాలను తీసుకుని వెనక్కు పంపేస్తారు. ముఖ్యమంత్రి వద్దకు కూడా అవి వెళ్లేవి కావట. జగన్ జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు కొందరు తీసుకెళ్లినా పెద్దగా జగన్ పట్టించుకోలేదు.
చీఫ్ సెక్రటరీలను కాదని....
ప్రవీణ్ ప్రకాష్ చీఫ్ సెక్రటరీలను కాదని ఉత్తర్వులు జారీ చేసేవారు. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా ఉత్తర్వులు ఇవ్వడం కొన్ని సార్లు వివాదమయింది. అయినా మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి వరసగా ఫిర్యాదులు అందడంతో ఆయనను సీఎంవో నుంచి తప్పించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. అయితే జగన్ వద్దకు వాస్తవ విషయాలను చేరనివ్వకుండా అనేక విషయాల్లో పక్కదారి పట్టించారన్న ఆరోపణలు లేకపోలేదు. దీనిపై వైసీపీ సీనియర్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. జగన్ కు చెప్పలేక, ప్రవీణ్ ప్రకాష్ ను అదుపులో పెట్టలేక మంత్రలు కూడా సతమతమయ్యారు. అనేక జీవోలు జారీ అయి నవ్వుల పాలయింది కూడా ఈయనగారి వల్లనేనట.
ఉద్యోగుల సమ్మె విషయంలో....
ఇటీవల ఉద్యోగ సంఘాల విషయంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ జగన్ ను తప్పుదోవ పట్టించారంటున్నారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ముందుగానే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, ఉద్యోగ సంఘాల అంగీకరించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారట. అందుకే జగన్ హెచ్ఆర్ఏ, ఫిట్ మెంట్ విషయంలో జీవో వెంటనే విడుదల చేశారంటున్నారు. కొత్త జీతాల విషయంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ వత్తిడి తెచ్చారంటున్నారు. సమ్మె దాకా తెచ్చుకుని ప్రభుత్వం చివరకు సాధించిందేమిటన్న ప్రశ్నలు తలెత్తాయి. జగన్ కు అనుభవం లేకనే అన్న విమర్శలు కూడా వచ్చాయి. దీనికి కారణమైన ప్రవీణ్ ప్రకాష్ ను అందుకే బదిలీ చేశారంటున్నారు. రాష్ట్రంలో ఉంచకుండా ఢిల్లీకి పంపారు. ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో కేవలం ఐఏఎస్, ఐపీఎస్ లే కాదు వైసీపీ నేతలు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారట.
Next Story