Fri Nov 22 2024 21:21:11 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్యా... పాఠాలు పని చేయడం లేదా?
ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయాల్లో రాణించలేకపోయారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆయన తర్వాత డీలా పడ్డారు
ప్రొఫెసర్ కోదండరామ్.. ఎందరికో పాఠాలు చెప్పారు. కానీ ఎన్నికల సమయం వచ్చే సరికి డీలా పడిపోయారు ఈ ప్రొఫెసర్. నీతికి, నిజాయితీకి పేరు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక భూమిక పోషించారు. జేఏసీ ఛైర్మన్ గా ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. లెక్కలతో పక్కాగా అందరికీ సమస్యలపై వివరించిన ప్రొఫెసర్ నాడు అన్ని పార్టీలకూ ఆప్తుడే. అందరూ ఆయనను పిలిచి మరీ గౌరవించేవారు. తమ గ్రామాలకు రావాలంటూ పిలుపులు ఉండేవి. తమ సభకు హాజరు కావాలంటూ ఆహ్వానాలు అందేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన రాజకీయంగా పూర్తిగా వెనకబడి పోయారు.
జనంలోకి...
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో ఉద్యమ సమయంలో అత్యంత సన్నిహితంగా గడిపారు. అన్ని రాజకీయ పక్షాలను కలిపి పోరాటం దిశగా తెలంగాణను సాధించేందుకు ప్రొఫెసర్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. కాలికి బలపం కట్టుకుని మరీ తెలంగాణ అంతటా తిరిగారు. విజయం సాధించారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కోదండరామ్ కేసీఆర్ తో విభేదించారు. బయటకు వచ్చారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు. తెలంగాణ జనసమితిని జనంలోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యారు. అది ఆయన విఫలమా? ప్రజలు ఆయనను పట్టించుకోలేదా? అన్నది వేరే విషయం. పార్టీ మాత్రం ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు. 2018 ఎన్నికల వరకూ రాజకీయ పార్టీలు ఆయనను దగ్గరకు తీసుకునేవి.
2018 ఎన్నికల్లో...
వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా ఆయనకు రెడ్ కార్పెట్ పలికేవి. 2018 ఎన్నికల్లో ఆయన మహా కూటమితో కలిశారు. ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానం తప్పించి ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు. 0.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సాధారణ ఎన్నికల్లో దెబ్బతిన్న ఫలితమోమో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. కాగా పార్టీలో కొందరు నేతలు ఆయనను విడిచి వెళ్లిపోతున్నారు. ఏ పార్టీ అయినా రాజకీయంగా ఎదుగుతుందన్న నమ్మకం ఉంటేనే అందులో ఉంటారు. లేకుంటే తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం బయటకు రావడం కామన్. దానికి ఎవరినీ తప్పు పట్టడానికి వీలులేకపోయినా ఇప్పుడు ప్రొఫెసర్ మాత్రం ఒంటరిగానే మిగిలిపోయారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కలసి ఆయన పార్టీ మద్దతు కోరారు. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ చెప్పారు.
చట్టసభల్లోకి...
ఆ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ముందు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం అనవసరమని ఆయన భావిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గణనీయమైన ఓట్లు రావడంతో ఆయన మద్దతును కాంగ్రెస్ కోరుకుంటుంది. మేధావులు, విద్యావంతుల ఓట్లు ఆయన మద్దతుతో సంపాదించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండి ఉండవచ్చు. కానీ ప్రొఫెసర్ వల్ల ఉపయోగం లేదని కొన్ని రాజకీయపార్టీలు భావించవచ్చు. కానీ కోదండరామ్ ను ఇప్పటికీ అభిమానించే యువకులున్నారు. విద్యావేత్తలు లేకపోలేదు. ఆయన అవసరం సాధారణ ఎన్నికల్లో అవసరం అవుతుందేమో. ఇప్పటి వరకూ అయితే ఆచార్య రాజకీయంగా విఫలమయినట్లే చెప్పుకోవాలి. మరి ప్రొఫెసర్ పట్ల ప్రజలు ఎందుకు విముఖత చూపుతున్నారన్నది మాత్రం ఆసక్తికరమే. ఆయననైనా చట్టసభల్లోకి పంపితే ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది.
Next Story