Mon Dec 23 2024 12:28:31 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ లో తలపాగా పెట్టేది అదేనట
పంజాబ్ లో ప్రస్తుతం రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంది. కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ఎక్కువగా పోరు జరుగుతుంది.
పంజాబ్ ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లు తలపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ లో పాగా వేసేదెవరు? అన్నది చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ లో ప్రస్తుతం రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ఎక్కువగా పోరు జరుగుతుంది. 117 ఉన్న పంజాబ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 59. ఈ అంకెను సాధించేందుకు రెండు పార్టీలూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఈ రెండు పార్టీలే...
పంజాబ్ లో మొన్నటి వరకూ బలమైన పార్టీ గా ఉన్న శిరోమణి అకాలీదళ్, బీజేపీలు విడిపోయాయి. దీంతో రెండు పార్టీలు బలహీనమయ్యాయనే చెప్పాలి. పంజాబ్ ఎన్నికల్లో ఈ రెండు పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పంజాబ్ లో మాల్వా ప్రాంతంలో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారికే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది. అందుకే అన్ని పార్టీలు మాల్వా ప్రాంతంపైనే కన్నేశాయి.
మాల్వా ప్రాంతం....
117 నియోజకవర్గాలుంటే అందులో దాదాపు 70 స్థానాలు మాల్వా ప్రాంతంలోనే ఉన్నాయి. దీనిని కాటన్ బెల్ట్ గా అంటారు. పత్తి ఎక్కువగా పండే ప్రాంతం. అందుకే రైతుల చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. తొలి నుంచి మాల్వా ప్రాంతం అకాలీదళ్ అడ్డాగా పేరుంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇక్కడ నలభై స్థానాలు దక్కడంతో అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా ఇక్కడ అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుంది.
సర్వేల ప్రకారం.....
అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బలపడిందన్న వార్తలు కాంగ్రెస్ లో కలవరం రేపుతున్నాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు ముప్పయి స్థానాలు సాధించే అవకాశముందని సర్వేలు తేల్చి చెప్పాయి. అందుకే కాంగ్రెస్ ఇక్కడ హామీల వర్షం కురిపించింది. కాంగ్రెస్, అకాలీదళ్ ఓట్లను చీల్చుకుంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే నిజమయితే మాల్వా ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలను సాధించి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
.
- Tags
- punjab
- elecitions
Next Story